Telangana Govt: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. దీర్ఘకాలిక అభివృద్ధిలో పౌరులను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరుతో ఒక డాక్యుమెంట్ రూపొందించనుంది. డాక్యుమెంట్ తయారీలో రాష్ట్ర పౌరులు భాగస్వాములు చేసేందుకు సిటిజన్ సర్వేకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.
తెలంగాణ రైజింగ్ విజన్-2047 సర్వే
తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరిట డాక్యుమెంట్ రూపొందిస్తోంది రేవంత్ సర్కార్. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా రూపకల్పన చేస్తున్న డాక్యుమెంట్ తయారీలో పౌరులను భాగస్వాములు చేస్తోంది. ఈ క్రమంలో సిటిజన్ సర్వేకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ సర్వే మొదలైంది. తెలంగాణలోని ప్రతి పౌరుడు, ఉద్యోగి తప్పనిసరిగా సర్వేలో పాల్గొనాలని కోరింది. దీనికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. ఈనెల 25 వరకు సర్వే జరగనుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రజానీకానికి ఫోన్ల ద్వారా మేసెజ్‌లు, దానికి సంబంధించిన లింకులు వెళ్లాయి.
డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 పేరిట డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ రైజింగ్ విజన్-2047 కేవలం ఒక విధాన పత్రం కాదని, ప్రజల సమిష్టి కల అని చెప్పారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్.తెలంగాణ పౌరులు రాష్ట్ర భవిష్యత్తుకు నిజమైన వాస్తుశిల్పులుగా వర్ణించారు. పౌర సర్వే ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను పంచుకోవడానికి కొన్ని నిమిషాలు కేటాయించాలని కోరుతున్నట్లు వివరించారు.
కీలకాంశాలు ఒక్కసారి చూద్దాం
విద్యార్థులు, యువత, రైతులు, వ్యవస్థాపకులు, నిపుణులు, సీనియర్ సిటిజన్లతోసహా ప్రతి పౌరుడు ఈ సర్వేలో వారి ఆలోచనలు, ప్రాధాన్యతలను పంచుకోవడానికి ఆహ్వానించింది. తెలంగాణలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరాల నుండి ప్రజల నిజమైన ఆకాంక్షలను ప్రతిబింబించేలా డాక్యుమెంట్‌ను రూపొందించనుంది. పౌరులంతా https://www.telangana.gov.in/telanganarising/ అనే వెబ్‌సైట్ ద్వారా సర్వేలో పాల్గొనాలని సూచించింది ప్రభుత్వం.
తెలంగాణ ఆర్థికవృద్ధిని 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడం కీలకమైంది. ఇందులోభాగంగా ఉద్యోగాల కల్పన, వాటికి సంబంధించిన కోర్సులు, స్టార్టప్‌లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు, చేపట్టాల్సిన సంస్కరణలు అందులో ప్రస్తావించారు.
ALSO READ: రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్
అలాగే స్థానిక సంస్థల బలోపేతానికి నిధులు, అధికారాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు గురించి వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, అభివృద్ధికి ప్రణాళికలు ఉండనున్నాయి. ప్రతీ మండలానికి ఓ ఆసుపత్రి, సంచార వాహనాలు, టెలి మెడికల్ ట్రీట్మెంట్, తక్కువ ధరలకు మందులు, ఆరోగ్య బీమా, పారిశుద్ధ్యం, సంబంధిత అంశాలున్నాయి.
ఇక చదువు, కోర్సుల విషయానికి వద్దాం. ఏఐ, రోబోటిక్స్, ఐటీఐలో నైపుణ్య ఆధారిత కోర్సులు ఉండనున్నాయి. అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటు, స్కిల్ డెవలప్‌మెంటుపై ఫోకస్ చేయడం ప్రధాన ఉద్దేశం. దీనికితోడు పౌర సేవలను ఒకే పోర్టల్ కిందకు తీసుకురావడంపై ప్రణాళిక కూడా ఉంది. ఇక ఫార్మా సెక్టార్‌లో బయో సైన్స్, అంతరిక్షం, రక్షణ రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు ఉండనున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధునాతన సేవల విస్తరణ వంటివి ఉన్నాయి.