
Vizag fishing harbour news(AP breaking news today) :
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నిన్న అర్థరాత్రి చెలరేగిన మంటల్లో 40కి పైగా బోట్లు పూర్తిగా దగ్ధమవ్వగా.. లక్షల విలువైన మత్స్యసంపద కాలి బూడిదైంది. దాంతో బాధితులు లబోదిబోమంటూ విలపించారు. బాధిత మత్స్యకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. మత్స్యకార నాయకులు నిరసన చేపట్టారు. ఫిషింగ్ హార్బర్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వెంటనే నష్టపరిహార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ సాయంత్రంలోగా ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి న్యాయం చేయాలని, ఒక్కో బోటుకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంతవరకూ పోరాడుతామని భీష్మించారు.
కాగా.. టీడీపీ నేత నారా లోకేష్ విశాఖ అగ్నిప్రమాదంపై స్పందించారు. “విశాఖ షిప్ యార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 40బోట్లు, కోట్లాదిరూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించింది. అత్యంత సున్నితమైన షిప్ యార్డు ప్రాంతంలో భద్రతాచర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణం. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేద మత్స్యకారులైనందున ప్రభుత్వం పెద్దమనసుతో స్పందించి వారికి కొత్తబోట్లు, మెరుగైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.” అని Xలో ట్వీట్ చేశారు.
