వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుకు వీర విధేయుల్లో కొందరు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్- లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులు అని పేర్కొన్నారు. ఇది చారిత్రక పరిణామం అని, దాచినా దాగని నిజం అని, మార్చలేని సత్యమని విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. వీళ్లంతా 1994-1996లో ఫిరాయింపు దారులని ఆరోపించారు. ఆ విషయం మీడియాకు, ప్రజలకు గుర్తుండదు అని అనుకోవడం వారి అజ్ఞానం అని చెప్పారు.
అంతే కాకుండా వాళ్లంతా ఇప్పుడు పుట్టుకతోనే చంద్రబాబు విధేయులం అని చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంతే కాకుండా ఇది ప్రజలను వంచించడం అని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపు దారులలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాడి వీరభద్రరావు, మాకినేని పెదరత్తయ్య, ప్రతిభా భారతి, కళా వెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, చిక్కాల రామచంద్రరావు, పరిటాల రవి, గాదె లింగప్ప, ముక్కు కాశిరెడ్డి, గౌతు శివాజీ, గద్దె బాబూరావు ఉన్నారని తెలిపారు.
అంతే కాకుండా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి బహిష్కరణకు గురైన వారిలో చంద్రబాబు, యనమల, అశోక్ గజపతి రాజు ఉన్నారని చెప్పారు. వీళ్లలో తొంభైశాతం మంది ఎన్టీఆర్ మరణించిన తరవాతనే 1996 లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ లక్ష్మీపార్వతి వర్గం ఒక్క సీటు గెలవకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు పార్టీలో చేరారన్నారు. 1997-2004 మధ్య ఉమ్మడి ఏపీ టీడీపీ మంత్రివర్గం సభ్యులుగా కొందరు ఎంపీలుగా, మరికొందరు పార్టీ పదవులు పొందారని వివరించారు. ఇది మాయని మచ్చ అని, చరిత్ర క్షమించదని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.