Vijayasai Reddy : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తనను మూడున్నారేళ్లగా తీవ్ర అవమానాలకు గురి చేశారని, తనపై లేనిపోని నిందలు మోపారంటూ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు విజయసాయి రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. జగన్ చుట్టూ చేరిన కోటరీ కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. కాకినాడ సీ పోర్ట్ వాటాల బదిలీ కేసులో సీఐడీ విచారణకు హాజరైన… విజయసాయి రెడ్డి, కేసు విషయంతో పాటుగా అనేక అంశాలపై స్పందించారు.
కాకినాడ సీ పోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో.. తన పేరు కావాలని చేర్చారని, తనకు ఆ కేసులో ఇటువంటి సంబంధం లేదని విజయసాయి రెడ్డి తెలిపారు. సీఐడీ విచారణలో ఈ కేసుకు సంబంధించి.. కెేవీ.రావుతో పరిచయం గురించి అడిగారని తెలిపిన సాయి రెడ్డి.. అరబిందో కంపెనీ నుంచి రూ.500 కోట్ల మేర బదిలీ అయిన విషయం గురించి ప్రశ్నించారన్నారు. కేవలం తన కూతుర్ని అరబిందో సంస్థల యజమానుల కుటుంబంలోకి పెళ్లి చేసి పంపించానే కానీ.. తనకు ఆ కుటుంబంతో ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని తెలిపారు.
రాజకీయ కక్షపూరితంగా, ఈ కేసులో ఓ అధికారి ఆదేశాలతో తన పేరును ఇరిగించినట్లుగా.. కేవీ రావు చెప్పినట్టుగా తెలిసిందని సాయిరెడ్డి తెలిపారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న విక్రాంత్ రెడ్డి గురించి ప్రశ్నించారన్నారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగా… ఆయనను కేవీ రావుకు తాను పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం.. సీఐడీ విచారణ చేస్తున్న కేసులో.. వాటాల బదిలీలు కానీ, డబ్బుల బదిలీ కానీ.. మొత్తం విక్రాంత్ రెడ్డే దగ్గరుండి నడిపించిన సంగతి తనకు తెలుసని.. ఆ సంగతినే విచారణ అధికారులకు చెప్పినట్లుగా తెలిపారు.
ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జిగా ఉన్నప్పుడు.. మైనింగ్ లో విక్రాంత్ రెడ్డి రూ.వేల కోట్లు ఆర్జించారని సీఐడీ అధికారులు ప్రశ్నించారన్న విజయ సాయి రెడ్డి, ఆ విషయంలో తనకు ఎలాంటి అవగాహన లేదన్నారు. ఆయన చేసే వ్యాపారాలపై అవగాహన లేదన్నారు. విశాఖలో ప్రజా దర్బార్ పెట్టినప్పుడు.. ఉద్యోగాల కోసం వచ్చిన యువతకి ఉద్యోగాలు కల్పించవలసిందిగా విక్రాంత్ రెడ్డిని కోరినట్లుగా తెలిపారు.
జేడీ లక్ష్మీనారాయణ అలవాటు చేశారు
తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమైందన్న విజయసాయి రెడ్డి, గతంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో, ఈడీ 10 కేసుల్లో.. తన పేరు ఏ-2గా చేర్చారని.. అదే పరంపరను కొనసాగిస్తున్నారన్నారు. అప్పుడు జేడీ లక్ష్మీ నారాయణ చేసిన పనినే.. ఇప్పుడు అధికారులు కొనసాగిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తనను ఏ-2 గా శాశ్వతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు.
వాటాల బదిలీలో జగన్ కు వాటా
కాకినాడ పోర్టు సిటీలో వాటాల బదిలీకి సంబంధించిన అంశంపై విచారణ చేసిన అధికారులు.. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి లబ్ది పొందారా అని ప్రశ్నించినట్లుగా తెలిపారు. జగన్ కు ఎలాంటి ప్రయోజనం చేకూరిందో తనకు తెలియదన్న సాయి రెడ్డి… తనకు తెలిసినంత వరకు జగన్ ప్రమోయం లేదన్నారు. కెేవీ రావును రాజకీయ బ్రోకర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ సాయి రెడ్డి.. తనకు అతనంటే అసహ్యం అంటూ పేర్కొన్నాడు. కావాలంటే.. తనకు, కేవీ రెడ్డికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలంటే కాల్ రికార్డ్ పరిశీలించవచ్చని కోరారు.
రాజకీయ భవిష్యత్తుపై
జగన్మోహన్ రెడ్డికి తనకి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని ఒప్పుకున్న విజయసాయిరెడ్డి.. అందుకు పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులే కారణమని ఆరోపించారు. మూడున్నర ఏళ్లుగా తనకు పార్టీలో అవమానం జరిగిందని, తనను అవమానిస్తూ ఇతరులు పార్టీలో పైకి వచ్చేందుకు ప్రయత్నించారని అన్నారు. తనకు పార్టీలో జరిగిన అవమానానికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర చెడుగా ముద్రపడేందుకు అనేక మంది సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారంటూ విజయసాయి రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన పార్టీ నుంచి బయటికి రావటం వల్ల.. నష్టపోలేదని, తను పార్టీలో ఉన్నంతకాలం చిత్తశుద్ధితోనే పని చేశానని మీడియాతో వ్యాఖ్యానించారు.
Also Read : Jagan: ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్తేమీ కాదు.. మళ్లీ మనమేనన్న జగన్
పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే తన కోరికని. కానీ జగన్ మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్న కోటరీ నుంచి బయటపడేంత వరకు ఆయనకు భవిష్యత్తు ఉంటుందన్నారు. బయట నుంచి వచ్చే వ్యాఖ్యలు, వ్యక్తులు ఎవరైనా జగన్ దగ్గరకు వెళ్లాలంటే.. చుట్టూ ఉన్న కోటరీకి అనుకూలంగా ఉంటేనే వెళ్లగలుగుతారని, వాళ్ళ అంగీకరించకపోతే వెళ్లడం వీలు కావడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లాలంటే ఆ కోటర్ కి ఏదో ఒక తీరుగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాల్సి ఉంటుందన్నారు. అధినాయకుడు అనే వాడు చెప్పుడు మాటలు నమ్మొద్దని, అలా నమ్మితే నాయకుడే నష్టపోతారని కామెంట్ చేశారు.
మనస్సు విరిగిపోయింది
జగన్మోహన్ రెడ్డి మనసులో తనకు స్థానం లేదని, తన మనస్సు పూర్తిగా విరిగిపోయిందన్న విజయసాయి రెడ్డి.. అలాంటప్పుడు పార్టీలో ఉండాల్సిన అవసరం తనకు లేదని జగన్ కు స్పష్టంగా తెలిపిన తర్వాతే బయటకు వచ్చినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తన చుట్టూ ఉన్న కోటరీ చెప్పే మాటలను గుడ్డిగా నమ్మడం మంచిది కాదన్నారు. తిరిగి తన వైసీపీ పార్టీలో చేరే ఉద్దేశం.. ఎట్టి పరిస్థితుల్లో లేదన్నారు. వేరే పార్టీ విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవన్నారు.
నన్ను జగన్ అనుమానించారు
తాను.. ఎక్కడా ప్రలోభాలకు లొంగలేదన్న విజయసాయి రెడ్డి.. తనను జగన్మోహన్ రెడ్డి అనుమానించారని తెలిపారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ విశ్వసించి తనను నిందించారన్నారు. అలాగే.. తాను ఏదో విషయానికి భయపడ్డానని, తాను ఎక్కడ భయపడలేదని, భయం తన బ్లడ్ లోనే లేదంటూ విజయ సాయిరెడ్డి కామెంట్ చేశారు. విశ్వసనీయత కోల్పోయారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారన్న సాయి రెడ్డి.. మొదటి నుంచి ఎలా ఉన్నానో, ఇప్పటి వరకు అలానే ఉన్నానన్నారు. తనలో ఇలాంటి మార్పు లేదని కేవలం జగన్మోహన్ రెడ్డిలోనే మార్పు వచ్చిందంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో చేతులు పట్టుకున్న జంట.. ఇది అమెరికా కాదంటూ క్లాస్!