Jagan: కూటమి సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు గడుస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. చదువు, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్‌గానీ ఇలా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని చెప్పుకొచ్చారు.ఏడాది అవుతున్నా ఫీజు రీయంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో కాలేదన్నారు.
వైసీపీ పార్టీ ఆవిర్భవించి మార్చి 12 నాటికి(బుధవారం) సరిగ్గా 15 ఏళ్లు అయ్యాయి. ఈ సందర్భంగా తాడేపల్లి నివాసం ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. ప్రజల కష్టాల నుంచి పార్టీ పుట్టిందని, వారి గురించి పోరాడుతోందన్నారు. అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం ఇస్తున్నామని చెప్పారు.
మనం చెప్పామంటే చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు వైసీపీ అధినేత. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లే స్థితిలో మన పార్టీ, కార్యకర్తలు ఉన్నారని చెప్పుకొచ్చారు. మూడు లేదా నాలుగేళ్లు తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని నేతలను, కేడర్‌ని ఉత్సాహపరిచే మాటలు చెప్పారాయన. రాజకీయాల్లో నైతిక విలువలను చాటి చెప్పిన జగన్, నేను విన్నాను.. నేను ఉన్నానంటూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో విడుదల చేసిన నిధులనే మళ్లీ ప్రస్తావించారాయన. రీయంబర్స్మెంట్, వసతి దీవెనకు ప్రతీ ఏడాదికి రూ. 3,900 కోట్లు అవుతుందన్నారు జగన్. కూటమి ప్రభుత్వం కేవలం రూ.700 కోట్లను కేటాయించిందన్నారు. ప్రభుత్వం కనీసం చదువును ప్రొత్సహించలేదన్నారు. ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి నిరసన కార్యక్రమం ఈ రోజు జరుగుతుందన్నారు. ఎంతసేపూ వైసీపీ పెట్టిన పథకాలకు నిధులు కేటాయించలేదన్నది అధినేత మాట.
ALSO READ: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి రిపోర్టు
జగన్ మాట్లాడుతున్న సమయంలో కొంతమంది హార్డ్ కోర్ అభిమానులు సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ మధ్యకాలంలో ముఖ్యనేతలు ఎక్కడికైనా వెళ్తే ఇదే స్లోగన్ బలంగా వినిపిస్తోంది. ఆ విధంగా చెప్పేవాళ్లను పిలిపిస్తున్నారో తెలీదు. తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ఫ్యాషన్ గా మారిందని కొందరు నేతలు అంటున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి: వైఎస్ జగన్
సూపర్ సిక్స్ హామీల అమలు కూడా గాలికొదిలేశారు
– వైఎస్ జగన్ pic.twitter.com/IsJaw4gm3n
— BIG TV Breaking News (@bigtvtelugu) March 12, 2025