మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధంగానే ఉన్నట్టు చెబుతున్న ఆయన పవన్ కల్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పవన్ కల్యాణ్ ని గతంలో తాను ఏమీ అనలేదని, ఇకపై కూడా విమర్శించబోనని చెప్పారు. ఆయన మాటలు విన్న ఎవరికైనా జనసేనపై కర్చీఫ్ వేశారనే విషయం ఈజీగా అర్థమవుతుంది. అయితే విజయసాయి మరింత తెలివిగా మాట్లాడారు. తనకీ చంద్రబాబుకీ శత్రుత్వం లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు, జగన్ ఇప్పటికైనా తెలివిగా వ్యవహరించాలని, తన చుట్టూ ఉన్న కోటరీ మాటలు వినకూడదని అన్నారు. అంటే జనసేనతోపాటు పాత పార్టీ వైసీపీ, అధికారంలో కీలక పార్టీ టీడీపీపై కూడా ఆయన కర్చీఫి వేశారని అర్థమవుతోంది.
జనసేనానికి దగ్గరగా
విజయసాయిరెడ్డి, జనసేనాని పవన్ కల్యాణ్ కి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 20 ఏళ్లుగా తనకి పవన్ తో స్నేహం ఉందని ఆయన చెప్పిన మాటల్లోని అంతరార్థం అదే. అయితే ఇక్కడే ఓ చిన్న తప్పు చేశారు విజయసాయి. తాను భవిష్యత్తులో పవన్ ని విమర్శించబోనని చెప్పడంతోపాటు, గతంలో కూడా తానెప్పుడూ ఆయన్ని పల్లెత్తు మాట అనలేదని పచ్చి అబద్ధమాడారు. గతంలో విజయసాయి పవన్ పై చేసిన వ్యాఖ్యలు, వేసిన ఘాటు ట్వీట్లను బయటపెడుతూ నెటిజన్లు ఆయన్ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
సీజనల్ దోమ..
పవన్ కల్యాణ్ ని గతంలో దారుణంగా విమర్శించారు విజయసాయిరెడ్డి. నిత్యకల్యాణం అంటూ ఆయన వ్యక్తిగత జీవితాన్ని వెటకారం చేశారు. ఆయన సీజనల్ దోమ అని అన్నారు. సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధుల్ని వ్యాపింపజేసే దోమలాంటోడు పవన్ అంటూ గతంలో ట్వీట్ వేశారు విజయసాయి. అవన్నీ మరచిపోయి ఇప్పుడు పవన్ ని మెప్పించేందుకు ఆయన్ను అస్సలు విమర్శించలేదని చెప్పడం హాస్యాస్పదం అంటున్నారు. జనం మరచిపోయారనుకున్నా, సోషల్ మీడియా మరచిపోదని చెబుతున్నారు. వైసీపీ సొంత మీడియా సాక్షినే దీనికి సాక్ష్యం అంటున్నారు నెటిజన్లు.
ఒకటా రెండా?
పవన్ కల్యాణ్ పై గతంలో లెక్కలేనన్ని సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి. ఆయన్ను ప్యాకేజీ స్టార్ అన్నారు, పార్టీని హోల్ సేల్ గా చంద్రబాబుకి అమ్మేశారని అన్నారు. ఆయన కాల్షీట్లు మొత్తం చంద్రబాబుకి రాసిచ్చేశారన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్ తో పాటు పవన్ ని కూడా కలిపి తిట్టేవారు విజయసాయి. కానీ హఠాత్తుగా ఇప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయినట్టుంది. జ్ఞానోదయంతోపాటు ప్రజలు అన్నీ మరచిపోయారనే భ్రమలో పడినట్టున్నారు. అందుకే పవన్ పై తన ప్రేమను బాహాటంగా బయటపెట్టారు. గతంలో తానెప్పుడూ ఆయన్ను ఏమీ అనలేదని అన్నారు.
విజయసాయి టార్గెట్ ఏంటి?
ప్రస్తుతానికి తాను ఏ పార్టీకి దగ్గరగా లేదని, వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి, అవసరమైతే కొత్త పార్టీ పెడతానని కూడా చెప్పారు. అదే సమయంలో తనకు ఏ పార్టీతోనూ, పార్టీ అధినేతలతోనూ విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఏ పార్టీలో చేరేందుకైనా తాను రెడీ అనే సంకేతాలు పంపించారని అర్థమవుతోంది. కానీ పవన్ అభిమానులు మాత్రం ఆయన మాటలు నమ్మేలా లేరు. సోషల్ మీడియాలో విజయసాయిపై దుమ్మెత్తిపోస్తున్నారు.