Police With Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల విచారణ ఎలా జరుగుతోంది? పోలీసుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా? తొలిరోజు పోలీసులు లేవనెత్తిన ప్రశ్నలకు అదుర్స్ సినిమాలో డైలాగ్స్ రిపీట్ అయ్యాయా? ముగ్గురు అధికారులు దాదాపు 30 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. భోజనం వద్దన్న వంశీ, కేవలం నీళ్లకి మాత్రమే పరిమితమయ్యాడా? దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని అంటున్నారు.
అసలేం జరిగింది?
గన్నవరం టీడీపీ ఆఫీసులో పని చేసే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసు నిమిత్తం మంగళవారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఉదయం 11 గంటలకు జైలు నుంచి వంశీతోపాటు మిగతా నిందితులు శివరామకృష్ణ, లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత విచారణకు తీసుకున్నారు. మళ్లీ సాయంత్రం మూడున్నర గంటలకు వైద్య పరీక్షలు చేయించి జైలుకి తరలించారు.
తొలిరోజు కేవలం రెండు గంటలు మాత్రమే ఆయన్ని అధికారులు ప్రశ్నించారు. ప్రశ్నించిన అధికారులు ఏసీపీ స్థాయికి చెందినవారే. సెంట్రల్ ఏసీపీ, క్రైమ్ ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీలు నిందితులను వేర్వేరుగా విచారించారు. ముగ్గురు అధికారుల టీమ్, తొలిరోజు కేవలం 30 ప్రశ్నలకు మాత్రమే పరిమితమైంది.
సీసీటీవీ పుటేజ్ దగ్గర పెట్టి
సత్యవర్ధన్ ఎవరో తనకు తెలీదని చెప్పించుకునే ప్రయత్నం చేశారట మాజీ ఎమ్మెల్యే వంశీ. సీసీ ఫుటేజ్ దగ్గర పెట్టిన అడిగితే ఒక రాత్రంతా సత్యవర్ధన్ తన ఇంట్లో ఉన్నాడని, ఆయనే సత్యవర్థన్ అని తాను గుర్తించలేదని చెప్పారట. అతడు తన ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాతే తనకు తెలిసిందని తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
ALSO READ: ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని ఎమ్మెల్యేకే సర్వే కాల్
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో యూ టర్న్‌పై తాము ఎవరినీ బలవంతం చేయలేదని వివరించారు వంశీ. అయితే ఫోన్లు ఎక్కడున్నాయో గుర్తు లేదన్నది వంశీ మాట. కేవలం మూడు మాటలు పదేపదే రిపీట్ చేశారట వంశీ. తెలీదు.. గుర్తు లేదు.. మరిచిపోయాను ఇవే సమాధానాలు వచ్చాయి. మొత్తం వంశీ వాడిన మూడు ఫోన్లలో కేవలం ఒకటి మాత్రమే పోలీసులకు ఇచ్చాడని సమాచారం. మరో రెండింటిలో మొత్తం డీటేల్స్ ఉన్నాయని పోలీసుల అంచనా. దానికి గురించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు మాజీ ఎమ్మెల్యే. చాలా ప్రశ్నలకు దాటవేసే ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్టు పోలీసుల సమాచారం.
అధికారులు అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి వంశీ సమాధానాలు ఇచ్చారు. చాలా వరకు అబద్ధాలు చెప్పారన్నది అధికారులు భావిస్తున్నా రు. ఈ కేసులో మిగిలిన నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతి మాత్రం ఎవరెవరు ఏయే బాధ్యతలు ఇచ్చారో పేర్లతో సహా వెల్లడించినట్టు తెలిసింది. సత్యవర్ధన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తాము వంశీ ఫ్లాట్‌కు తీసుకెళ్లినట్టు అంగీకరించారట.
వెంటాడుతున్న భయం.. కేవలం నీళ్లకే పరిమితం
పోలీసుల విచారణ సమయంలో భోజనం తీసుకోవడానికి వంశీ ఏమాత్రం ఇష్టపడలేదని తెలిసింది. మూడుసార్లు అడిగినా తాను భోజనం చేయనని సమాధానం ఇచ్చారు. కస్టడీలోకి తీసుకున్న నుంచి సాయం త్రం వరకు కాఫీ, టీ తాగుతారా అడిగినప్పటికీ అవేమీ వద్దని జవాబిచ్చారట. కేవలం మంచి నీళ్లు మాత్రమే కావాలని కోరారు. మిగిలిన నిందితులు భోజనాలు చేశారు.
ఇదిలాఉండగా వంశీ మూడు రోజుల కస్టడీని రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో మంగళవారం మెమో దాఖలైంది. నిందితుల తరఫు న్యాయవాది చిరంజీవి వాటిని దాఖలు చేశారు. నిందితులను విచారించే ప్రాంతం నిందితుల తరపు న్యాయవాదులకు తెలియజేయాలని పేర్కొన్నారు. విచారణ సమయంలో నిందితులతో మాట్లాడుకునే అవకాశం న్యాయవాదులకు ఉంటుందని వివరించారు. దర్యాప్తు అధికారులు ఈ విషయాలు ఏవీ తమకు తెలియజేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల పోలీసు కస్టడీని రద్దు చేయాలని కోర్టును కోరారు.