TDP MLA: హలో నమస్తే సార్.. మీ పేరు.. రవి మీరెవరు అంటూ ఇవతలి వ్యక్తి సమాధానంతో కూడిన ప్రశ్న వేశారు. మేము సర్వే చేస్తున్నాం సార్ అంటూ ఆ మహిళ జవాబు. మీ ఎమ్మేల్యే తీరు ఎలా ఉందంటూ అదే మహిళ మరో ప్రశ్న. మా ఎమ్మేల్యే పనికిమాలినోడు.. శుద్ద దండగ.. అంటూ సమాధానం. ఓకే సార్ నోట్ చేసుకున్నాను. ఇలా సాగింది వారిద్దరి మధ్య సంభాషణ.
ఇంతకు ఈ కాల్ వచ్చిందో ఎవరికో తెలుసా.. సాక్షాత్తు అదే నియోజకవర్గ ఎమ్మేల్యేకే. ఆ ఎమ్మేల్యేకే ఫోన్ చేసి, మీ ఎమ్మేల్యే పనితీరు ఎలా ఉందంటే.. ఆ ఎమ్మేల్యే చెప్పిన మాటలివి. ఎమ్మేల్యే సరదాగా జవాబిచ్చినా, ఆ మహిళ కూడా అదే రీతిలో ఎవరో తెలుసుకోకుండా ప్రశ్నలు కురిపించడం విశేషం. ఈ విచిత్ర కాల్ ఎదుర్కొన్నది ఎవరో కాదు ఆముదాలవలస టీడీపీ ఎమ్మేల్యే కూన రవికుమార్.
అసలేం జరిగిందంటే..
ఎమ్మేల్యే కూన రవికుమార్ తన అనుచరులతో ఉన్న సమయంలో ఓ కాల్ వచ్చింది. తరచుగా ఎవరో ఒకరు సమస్యల మీద కాల్ చేస్తుంటారన్న పరిస్థితుల్లో ఎమ్మేల్యే కాల్ లిఫ్ట్ చేశారు. ఆ కాల్ లిఫ్ట్ చేశారో లేదో.. సార్ మీ పేరు అంటూ ఓ మహిళ ప్రశ్న వేసింది. అప్పటికే ఇదొక ఐవీఆర్ఎస్ కాల్ గా గుర్తించిన ఎమ్మేల్యే మాటలు కలిపారు. తన పేరు చెప్పి, మీకేం కావాలని అడిగారు. అప్పుడు ఫోన్ చేసిన మహిళ మీ ఎమ్మేల్యే పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటని అడిగింది. అందుకు ఎమ్మేల్యే.. మా ఎమ్మేల్యే పెద్ద పనికిమాలినోడు అంటూ సమాధానం ఇచ్చారు. పక్కనే గల నాయకులు ఈ సంభాషణ చూసి ఫక్కున నవ్వారు.
అయితే మీ ఎమ్మేల్యే తీరు అలా ఉందా అంటూ నోట్ చేసుకున్నట్లు మహిళ తెలిపింది. అంతటితో ఆగక మీ వయస్సు ఎంత అంటూ మహిళ మరో ప్రశ్న వేసింది. మగవాడి వయస్సు, ఆడవారి జీతం అడగవద్దు అంటూ ఎమ్మేల్యే బదులిచ్చారు. మీకు పెళ్లి అయిందా అంటూ ఆ మహిళ అడగగా, తనకు పెళ్లి కాలేదని, కుర్రోడిని అంటూ ఎమ్మేల్యే చెప్పారు. మీ వయస్సు చెప్పండి.. ఏ వయస్సో చెబితే, ఆ వయస్సు వారి మనస్సులో ఎమ్మేల్యే పనితీరు ఇలా ఉందని తాను నోట్ చేసుకుంటానని ఆ మహిళ చెప్పింది. ఎట్టకేలకు 54 సంవత్సరాలుగా ఎమ్మేల్యే చెప్పారు.
ఈ తతంగమంతా సాగుతున్నంత సేపు పక్కనే గల టీడీపీ నాయకులు, కార్యకర్తలు నవ్వుతూ వీరి సంభాషణ విన్నారు. అయితే ఎమ్మేల్యేకు ఐవీఆర్ఎస్ కాల్ రాగా, వారి మాటలను ఫోన్ లో ఎవరో రికార్డ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: మీ సినిమాలో ఈ సీన్స్ ఉన్నాయా.. పవన్ తో సీఎం చంద్రబాబు
కాల్ కట్ కాగానే, ఇదంతా జగన్ చేయుస్తున్న కాల్స్ గా ఎమ్మేల్యే ఆరోపించడం విశేషం. మొత్తం మీద ఎమ్మేల్యే చెప్పినట్లుగా జగన్ చేయిస్తున్నారా? లేక మరేదైనా పార్టీ సర్వే చేయిస్తుందా అన్న విషయం పక్కన పెడితే, ఎమ్మేల్యేకే ఫోన్ చేసి మీ ఎమ్మేల్యే పనితీరు ఎలా ఉందంటూ ప్రశ్నించడం విశేషమని చెప్పవచ్చు. అయితే ఎమ్మేల్యే కు ఈ కాల్ ఎప్పుడు వచ్చిందనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.