Big Stories

Visakhapatnam : ఏపీకి ఒక్కటే రాజధాని..? విశాఖ నుంచే పాలన…బుగ్గన క్లారిటీ..

Visakhapatnam : ఏపీకి ఒక్కటే రాజధాని ఉంటుందా? విశాఖనే ప్రభుత్వం పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తుందా? తాజాగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. అసలు విషయంలోకి వెళితే మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్ నాథ్ పాల్గొన్నారు. ఈ వేదికపై బుగ్గన ఏపీకి ఒక్కటే రాజధాని అని స్పష్టం చేశారు. అమరావతి పేరునే అసలు ప్రస్తావించలేదు.

- Advertisement -

ఒక్కటే రాజధాని..
ఏపీకి 3 రాజధానులు లేవని ఆర్థికమంత్రి బుగ్గన తేల్చేశారు. రాష్ట్రానికి విశాఖనే రాజధానిగా చేయబోతున్నామని స్పష్టంచేశారు. కర్నూలు న్యాయరాజధాని కాదని అక్కడ హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్‌ మాత్రమే ఉంటుందని ప్రకటించారు. అమరావతి పేరును అసలు ప్రస్తావించలేదు. మౌలిక సదుపాయాలు ఉండటం వల్లే విశాఖను పాలనా రాజధానిగా ఎంచుకున్నామన్నారు. ఈ నగరం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

ఐటీకి చిరునామాగా..
పారిశ్రామిక వృద్ధి ప్రాంతాలుగా తిరుపతి, విజయవాడను ఎందుకు ఎంచుకోలేదన్న పారిశ్రామికవేత్తల ప్రశ్నకు సమాధానంగా రాజధాని అంశాన్ని బుగ్గన ప్రస్తావించారు. విశాఖకు ఓడరేవు నగరంగా ఇప్పటికే గుర్తింపు ఉందని.. అందుకే రాజధానిగా ఎంపిక చేసుకున్నామని స్పష్టంచేశారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందని తెలిపారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ మాదిరిగానే.. విశాఖను ఐటీ రంగానికి చిరునామాగా మార్చాలన్నదే లక్ష్యమన్నారు.

కర్నాటకతో పోలిక..
ఏపీ పరిస్థితులను కర్నాటకతో పోల్చే ప్రయత్నం చేశారు బుగ్గన. కర్ణాటకలో ఒక సెషన్‌ అసెంబ్లీ సమావేశాలు బెలగావిలో జరుగుతాయని.. అదే విధంగా ఏపీలోనూ అసెంబ్లీ సమావేశాలు ఒక సెషన్‌ గుంటూరులో నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కర్ణాటకలో ధార్వాడ్‌, గుల్బర్గాలో హైకోర్టు బెంచ్ లు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇలాగే కర్నూలులోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

3 రాజధానుల మాటేంటి?
పాలనా వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యమని ఇన్నాళ్లు సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనని పదే పదే ప్రకటించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మనసు మార్చుకుందా? లేక ఓ స్ట్రాటజీ ప్రకారం 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చి…చివరికి విశాఖను మాత్రమే రాజధానిగా మారుస్తుందా? అందుకోసమే అమరావతి నుంచి నేరుగా విశాఖకు రాజధాని మార్చకుండా మధ్యలో 3 రాజధానులు పేరుతో గేమ్ ప్లే చేసిందా..? చూద్దాం ఏం జరుగుతుందో! ఇప్పటికే ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఏపీ రాజధానిపై పూర్తి క్లారిటీ వస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News