Panchayat Elections: విజయనగరం జిల్లా లో మొదటిగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తరువాత పరిషత్ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకంగా, ప్రతిష్టాత్మకంగా భావించే పంచాయతీ పోరును సైతం పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సర్పంచ్ ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారిగా, జిల్లా పంచాయతీ అధికారి డి.వి.మల్లికార్జునరావు వ్యవహరిస్తున్నారు.
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం రెవెన్యూ డివిజన్ల పరిధిలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి, రెండు, మూడో విడతల పూర్తి షెడ్యూల్ మరియు పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల (నవంబర్) 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 3 న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.
మొదటి విడత (నవంబర్ 26): మొదటి విడతలో మొత్తం 9 మండలాల్లోని 237 గ్రామ పంచాయతీలు, 2,306 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 2,306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో బొబ్బిలి డివిజన్లోని బాడంగి (25 పంచాయతీలు, 240 వార్డులు), బొబ్బిలి (30 పంచాయతీలు, 292 వార్డులు), రామభద్రాపురం (22 పంచాయతీలు, 212 వార్డులు); చీపురుపల్లి డివిజన్లోని రాజాం (21 పంచాయతీలు, 212 వార్డులు), సంతకవిటి (34 పంచాయతీలు, 326 వార్డులు); విజయనగరం డివిజన్లోని భోగాపురం (22 పంచాయతీలు, 218 వార్డులు), డెంకాడ (27 పంచాయతీలు, 256 వార్డులు), నెల్లిమర్ల (28 పంచాయతీలు, 260 వార్డులు), పూసపాటిరేగ (28 పంచాయతీలు, 290 వార్డులు) మండలాలు ఉన్నాయి.
ఈ విడతకు నవంబర్ 13న ఏపీఎస్ఈసీ (APSEC) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 15న ఆర్వో (RO) నోటీసు జారీ చేస్తారు. 17న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా, 18న నామినేషన్ల పరిశీలన, 19న తిరస్కరణలపై అప్పీలు, 20న అప్పీళ్ల పరిష్కారం ఉంటాయి. 21న నామినేషన్ల ఉపసంహరణతో పాటు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 26న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలను వెల్లడిస్తారు. అవసరమైతే నవంబర్ 27న రీ-పోలింగ్ నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ పరోక్ష ఎన్నికకు సంబంధించి నవంబర్ 26 లోపు సభ్యులకు నోటీసులు జారీ చేసి, 26 లేదా 27 తేదీల్లో ప్రత్యేక సమావేశం ద్వారా ఎన్నిక పూర్తి చేస్తారు.
Also Read: భారతలో మినీ స్విట్జర్లాండ్.. ఈ హిల్ స్టేషన్కు వెళ్తే తిరిగి రావాలనిపించదు
నవంబర్ 29రెండో విడతలో 9 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీలు, 2,388 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, మొత్తం 2,448 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో బొబ్బిలి డివిజన్లోని దత్తిరాజేరు (35 పంచాయతీలు, 312 వార్డులు, 312 పోలింగ్ కేంద్రాలు), గజపతినగరం (30 పంచాయతీలు, 278 వార్డులు, 278 కేంద్రాలు), మెంటాడ (31 పంచాయతీలు, 272 వార్డులు, 272 కేంద్రాలు); చీపురుపల్లి డివిజన్లోని చీపురుపల్లి (19 పంచాయతీలు, 198 వార్డులు, 218 కేంద్రాలు), మెరకముడిదాం (29 పంచాయతీలు, 274 వార్డులు, 274 కేంద్రాలు); విజయనగరం డివిజన్లోని కొత్తవలస (25 పంచాయతీలు, 246 వార్డులు, 266 కేంద్రాలు), లక్కవరపుకోట (31 పంచాయతీలు, 288 వార్డులు, 288 కేంద్రాలు), శృంగవరపుకోట (26 పంచాయతీలు, 252 వార్డులు, 272 కేంద్రాలు), వేపాడ (29 పంచాయతీలు, 268 వార్డులు, 268 కేంద్రాలు) మండలాలు ఉన్నాయి.
రెండో విడతకు నవంబర్ 16న ఏపీఎస్ఈసీ నోటిఫికేషన్, 18న ఆర్వో నోటీసు జారీ అవుతాయి. నవంబర్ 20న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా, 21న పరిశీలన, 22న అప్పీలు, 23న అప్పీళ్ల పరిష్కారం జరుగుతాయి. 24న నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటాయి. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలను ప్రకటిస్తారు. అవసరమైతే నవంబర్ 30న రీ-పోలింగ్ ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కోసం నవంబర్ 29 లోపు నోటీసులు జారీ చేసి, 29 లేదా 30 తేదీల్లో ప్రత్యేక సమావేశం ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు.
డిసెంబర్ 2 మూడో విడతలో మొత్తం 9 మండలాల్లోని 283 గ్రామ పంచాయతీలు, 2,618 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, ఇందుకోసం 2,634 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో బొబ్బిలి రెవెన్యూ డివిజన్లోని తెర్లాం (33 పంచాయతీలు, 310 వార్డులు, 310 పోలింగ్ కేంద్రాలు); చీపురుపల్లి డివిజన్లోని గరివిడి (29 పంచాయతీలు, 278 వార్డులు, 294 కేంద్రాలు), గుర్ల (42 పంచాయతీలు, 368 వార్డులు, 368 కేంద్రాలు), రేగిడి ఆమదాలవలస (39 పంచాయతీలు, 362 వార్డులు, 362 కేంద్రాలు), వంగర (29 పంచాయతీలు, 256 వార్డులు, 256 కేంద్రాలు); విజయనగరం డివిజన్లోని బొండపల్లి (28 పంచాయతీలు, 258 వార్డులు, 258 కేంద్రాలు), గంట్యాడ (36 పంచాయతీలు, 334 వార్డులు, 334 కేంద్రాలు), జామి (25 పంచాయతీలు, 244 వార్డులు, 244 కేంద్రాలు), విజయనగరం (22 పంచాయతీలు, 208 వార్డులు, 208 కేంద్రాలు) మండలాలు ఉన్నాయి.
ఈ విడతకు నవంబర్ 19న ఏపీఎస్ఈసీ (APSEC) ఎన్నికల నోటిఫికేషన్, 21న ఆర్వో (RO) నోటీసు జారీ అవుతాయి. నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా, 24న నామినేషన్ల పరిశీలన, 25న తిరస్కరణలపై అప్పీలు, 26న అప్పీళ్ల పరిష్కారం ఉంటాయి. నవంబర్ 27న నామినేషన్ల ఉపసంహరణతో పాటు పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలను వెల్లడిస్తారు. అవసరమైతే డిసెంబర్ 3న రీ-పోలింగ్ నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ పరోక్ష ఎన్నికకు సంబంధించి నవంబర్ 19న నోటిఫికేషన్ విడుదల కాగా, డిసెంబర్ 2 లోపు సభ్యులకు నోటీసులు జారీ చేసి, అదే రోజు (డిసెంబర్ 2) ప్రత్యేక సమావేశం ద్వారా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారు.
మూడు దశల్లో కలిపి జిల్లాలోని 775 గ్రామ పంచాయతీల్లో 7,312 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం మొత్తం 7,388 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ సామగ్రి, ఇతర ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
Also Read: చచ్చినా వదలని ప్రేమ మత్తు… కుక్క సాయంతో ప్రేయసికి చేరువగా… ది బాప్ ఆఫ్ ఎమోషనల్ రైడ్