AP Volunteers latest news(Andhra pradesh today news): ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసలు, విమర్శలు కూడా ఉన్నాయి. ఈ వ్యవస్థ వల్ల లబ్దిదారులకు కలుగుతున్న ప్రయోజనాల రీత్యా ఏ పార్టీ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించలేకపోతున్నది. అయితే.. వాలంటీర్ వ్యవస్థను రాజకీయం చేసిన తర్వాత ఈ వ్యవస్థ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వచ్చాయి. ఎన్నికలకు ముందు ఇలాంటి అనుమానాలు ఎక్కువ వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం వస్తేనే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని, కూటమి ప్రభుత్వం వస్తే ఆ వ్యవస్థ రద్దయిపోవచ్చనే ప్రచారం జరిగింది. ఇది రాజకీయంగా కూటమిని నష్టపరిచే ప్రమాదమూ ఉండింది.
కానీ, ఎన్నికలకు ముందు టీడీపీ వాలంటీర్ వ్యవస్థకు అనుకూలంగా మాట్లాడింది. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాలంటీర వ్యవస్థ కొనసాగుతుందని, వైసీపీ ఇచ్చే గౌరవ వేతనం కంటే కూడా తాము ఎక్కువగా ఇస్తామని ప్రకటించింది. వాలంటీర్లకు నెలకు రూ. 10 వేల వేతనం ఇస్తామని కూడా స్పష్టం చేసింది. అయినా.. కొందరిలో.. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల్లో దీనిపై పూర్తి విశ్వాసం ఏర్పడలేదు. దీంతో ఇప్పటికీ ఇంకా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ వ్యాఖ్యలపై స్పందించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
Also Read: సీఎం మీటింగ్ సక్సెస్.. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. వాలంటీర్లను వైసీపీ రాజకీయంగా వాడుకున్నదని, కానీ, తాము వారి భవిష్యత్‌ను కూడా దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారు. ఇలాంటి కథనాలు కేవలం కూటమి ప్రభుత్వ కీర్తిని దెబ్బతీయాలనేనని విమర్శించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.