Revanth Reddy America Tour updates(TS today news): సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సత్ఫలితాలను ఇస్తున్నది. మూడో రోజు పర్యటనలో భాగంగా పలు కంపెనీ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో వ్యాపారానికి ఉన్న సానుకూలతలను వివరించారు. కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. కాగ్నిజెంట్ తెలంగాణపై ఆసక్తి చూపించింది. ఏకంగా హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంవోయూలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటు చేస్తామని కాగ్నిజెంట్ పేర్కొంది. ఈ క్యాంపస్‌లో దాదాపు 15 వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపింది.
కాగ్నిజెంట్ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచంలోని మేటి టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగానికి మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందుకోసం ప్రత్యేక దృష్టి పెడుతుందని హామీ ఇచ్చారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం అవసరమైన మద్దతు అంతా ఇస్తుందని వివరించారు.
ఈ పరిణామాలతో సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ ఏర్పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలు కలుగుతాయని, ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం పడుతుందని వివరించారు. ఐటీ సేవలను రాజధాని నగరంతోపాటు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయానికి కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
Also Read: వారితో పోటీ పడలేమా ? : సీఎం చంద్రబాబు
ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
కాగ్నిజెంట్ సీఈవో సీఈవో ఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉన్నదని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే కొత్త సెంటర్ ఉపకరిస్తుందని తెలిపారు. ఐటీ సేవలతోపాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా అధునాతన సాంకేతికతలపై హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే కొత్త కేంద్రం స్పెషల్ ఫోకస్ పెడుతుందని చెప్పారు.