ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రుషికొండ ప్యాలెస్ వ్యవహారం బయటకొచ్చింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ.. రుషికొండవైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా కట్టుదిట్టం చేసింది. కానీ ఆ తర్వాత రాజకీయ రహస్యం బట్టబయలైంది. అంటే దాదాపుగా రుషికొండ వ్యవహారం ప్రజలకు తెలిసి ఏడాది అవుతోందనమాట. ఆ భవనంలో అత్యాధునిక ఫర్నిచర్, విలాసవంతమైన వస్తువులు, ఆఖరికి బాత్రూమ్ లో కూడా లక్షల విలువైన వస్తువుల్ని వాడటం ఆశ్చర్యకరం. ప్యాలెస్ రహస్యం బయటపడి ఏడాది అవుతున్నా.. దాన్ని ఏం చేయాలనే విషయంపై కూటమి ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. చివరిగా ఏ నిర్ణయానికీ రాలేకపోతోంది. ఇప్పటికైనా దాన్ని వినియోగంలోకి తెస్తారా..? ఒకవేళ తెస్తే ఏం చేస్తారు..? దాన్ని ఎలా వినియోగిస్తారు..? ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానం తెలుస్తుంది.
ఆ బిల్డింగ్ ని ఏం చేస్తారు..?
రుషికొండ ప్యాలెస్ నిర్మాణ సమయంలోనే పెద్ద రచ్చ జరిగింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని, కొండకు గుండు కొట్టించారంటూ అప్పటి ప్రతిపక్షాలు ఇప్పటి అధికార పక్షాలైన టీడీపీ, జనసేన విమర్శించాయి. ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ మాత్రం ఆ బిల్డింగ్ విషయంలో ముందుకే వెళ్లారు. చివరకు కోర్టు కేసులు వేసినా కూడా దాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు అధికారం మారింది. అప్పుడు తాము విమర్శించిన బిల్డింగ్ ని ఇప్పుడు తామే వినియోగిస్తే బాగోదని కూటమి ఆలోచిస్తోంది. అంటే అధికారిక కార్యక్రమాలకు దాన్ని వినియోగిస్తే విమర్శలొస్తాయి. పోనీ అలా ఖాళీగా పెడితే ప్రజా ధనం వృధా అనే అపవాదు కూడా వస్తుంది. అందుకే మధ్యేమార్గం కోసం ఆలోచిస్తున్నారు నేతలు. చాలామంది చాలా రకాల సలహాలు ఇచ్చారు. కానీ సీఎం చంద్రబాబు దేన్నీ ఫైనల్ చేయలేదు. ప్రజల ఉపయోగం కోసమే దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.
ఏది లాభదాయకం?
అసలు రుషికొండ ప్యాలెస్ అటూ ఇటూ కాకుండా ఉంది. అన్ని కోట్లు పోసి కట్టిన ప్యాలెస్‌ను లాభదాయకంగా మార్చాలంటే ఏం చెయ్యాలా అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2024లో అధికారంలోకి వస్తే ఆ ప్యాలెస్ నుంచి పాలించాలని జగన్ కలలు కన్నారు. కానీ ఆ కలలు నిజం కాలేదు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రొజెక్ట్ చేస్తున్న కూటమి అక్కడ నిర్మాణ పనుల జోరు పెంచింది, తాజా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అక్కడ్నుంచే జరుగుతున్నాయి. ఇకపై అధికారంలోకి ఎవరు వచ్చినా అమరావతిని కదల్చడానికి వీల్లేకుండా కేంద్రం నుంచి కూడా గెజిట్ విడుదల చేయించే దిశగా కూటమి అడుగులు వేస్తోంది. సో రుషికొండ ప్యాలెస్ ఇక ఎప్పటికీ సీఎం కార్యాలయం కాలేదు. అలాగని దాన్ని ఉత్తరాంధ్ర పర్యటనలకు వచ్చినప్పుడు మాత్రమే సీఎం వాడుకునేలా మార్చినా ఫలితం ఉండదు. అంత పెద్ద బిల్డింగ్ ని వృధాగా మార్చారనే విమర్శలు వస్తాయి. స్థానికుల నుంచి వస్తున్న సలహాల ప్రకారం అయితే దాన్ని మ్యూజియంగా మార్చే అవకాశం ఉంది. విశాఖకు, రుషి కొండ బీచ్ కు పర్యాకుల తాకిడి ఎక్కువ కాబట్టి.. ఇది లాభదాయకంగానే ఉంటుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరే అకాశముంది. పర్యాటకుల ద్వారా ఆదాయాన్ని రాబట్టేలా రుషికొండ ప్యాలెస్ ని ఉపయోగించుకోగలిగితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఆ భవనాన్ని సద్వినియోగం చేశారన్న క్రెడిట్ కూడా దక్కుతుంది.