రాత్రిపూట గురక పెట్టడం అనేది చాలామందికి జరిగే సాధారణ సమస్యే. ముఖ్యంగా జలుబు వచ్చినప్పుడు, లేదా చలికాలంలో ముక్కు బ్లాక్ అయిపోతే గురక ఎక్కువగా వస్తుంది. కానీ తరచూ ప్రతి రాత్రీ గురక పెట్టడం మాత్రం సాధారణం కాదు. ఇది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నట్లయితే, పదేపదే గురక పెట్టడం అనేది స్లీప్ అప్నియా అనే వ్యాధికి ప్రధాన సూచిక. స్లీప్ అప్నియా అంటే నిద్రలో శ్వాస ఆగిపోవడం లేదా అడ్డంకులు కలగడం. ఈ పరిస్థితి కారణంగా శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. దాంతో రాత్రంతా నిద్ర సరిగ్గా పడదు, పగటి పూట అలసట, నిద్రలేమి వెంటాడుతుంటాయి. ఒకసారి రెండు సార్లు కాకుండా ప్రతిరోజూ ఇలా జరుగుతుంటే అది శరీరానికి ప్రమాదకర ప్రభావం చూపుతుంది.
డాక్టర్ సేథి తెలిపిన వివరాలు ప్రకారం, గురక సమస్యను నిర్లక్ష్యం చేస్తే మొదటిగా పగటిపూట మితిమీరిన నిద్ర, అలసట వస్తాయి. ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరం ఫ్రెష్‌గా అనిపించదు. క్రమంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి అధికం కావడంతో హై బీపీ సమస్య తలెత్తుతుంది. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు కాబట్టి ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది.
Also Read: OG Trailer Late : ట్రైలర్ లేట్ అవ్వడానికి కారణం DI, AI కాదు… అంతా ప్రశాంత్ వర్మనే
గురక కారణంగా గుండెపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇన్సులిన్ పనితీరు దెబ్బతినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ అవుతుంది. మరోవైపు సరైన నిద్ర లేకపోవడంతో మెదడుకు అవసరమైన విశ్రాంతి దొరకదు. దీని ఫలితంగా జ్ఞాపకశక్తి బలహీనమవుతుంది, ఏకాగ్రత తగ్గిపోతుంది.
ఇంతటి తీవ్రమైన సమస్యలకు గురక కారణమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందువల్ల దీనిని చిన్న సమస్యగా తీసుకోవడం తప్పు. గురక తరచూ వస్తుంటే, నిద్రలో శ్వాస ఆగిపోతే లేదా పగటిపూట అలసటగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. సరైన ట్రీట్మెంట్‌తో సమస్యను కంట్రోల్ చేయవచ్చు. అదనంగా బరువు తగ్గడం, మద్యం తగ్గించడం, పొగ త్రాగడాన్ని మానేయడం, సైడ్‌గా పడుకోవడం వంటి చిన్న మార్పులు కూడా గురకను తగ్గించడంలో సహాయపడతాయి.
మొత్తం మీద, రాత్రిపూట తరచూ గురక పెట్టడం అనేది నిర్లక్ష్యం చేయదగిన విషయం కాదు. అది శరీరానికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. కాబట్టి దీన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.