ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ కూటమిలో బీజేపీ కూడా ఉంది. అదే బీజేపీ కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీ. రాష్ట్రంలోని కూటమిని వ్యతిరేకించే ఏ పార్టీ అయినా కేంద్రంలోని కూటమిని వ్యతిరేకించినట్టే లెక్క. కానీ ఏపీలో అలా కాదు, ఆ మాటకొస్తే అసలు జగన్ తీరే వేరు. జగన్ ఎన్డీఏ కూటమిలో చేరరు, అలాగని బయట సైలెంట్ గా ఉండరు. ఎన్డీఏ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆయన సై అంటారు, ఒకవేళ అనలేదా? ఏం జరుగుతుందో జగన్ కే బాగా తెలుసు. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జైలునుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని వచ్చి మరీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓటు వేశారు. ఆయన ఎవరికి ఓటు వేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా జగన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను ఓ రేంజ్ లో మోసేశారు. జీఎస్టీకి సంస్కరణలకు ఆయన జీ హుజూర్ అన్నారు. జీఎస్టీ సవరణను విప్లవాత్మక చర్యగా అభివర్ణించారు జగన్. పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తూ, సామాన్యులు కూడా భరించేలా జీఎస్టీలో మార్పులు చేయడం అభినందనీయం అని కొనియాడారు. అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఉన్నా, అభ్యంతరాలు ఎదురైనా, జీఎస్టీలో సవరణ ఫలాలు ప్రతి వినియోగదారుడికి చేరుతాయని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. దేశంలో వస్తువుల వినియోగంతో పాటు, పెట్టుబడుల రంగానికి ఈ సంస్కరణలు మరింత ప్రోత్సాహకంగా ఉంటాయన్నారు జగన్.
The GST restructuring is a revolutionary step towards a simpler, fairer tax system It is a commendable move to make goods & services more simpler and affordable to every citizen. Here and there ,there might be a few glitches with a few complaints but it’s a process and I am…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2025
జగన్ కాదు భజన్
ఈ మాట స్వయానా జగన్ చెల్లెలు షర్మిలే అంటున్నారు. మోదీ భజనలో జగన్ ఆరితేరిపోయారంటున్నారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన.. మోదీని పొగిడినా, మోదీ నిర్ణయాల్ని స్వాగతించినా పెద్ద పట్టింపు లేదని, కానీ జగన్ ఇలా తయ్యారేంటని ఆమె పలుమార్లు నిలదీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆయన వ్యతిరేకించిన బీజేపీతో జగన్ మిలాఖత్ కావడాన్ని షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. కానీ జగన్ అవేవీ పట్టించుకోరు. మోదీని ప్రసన్నం చేసుకోవడమే ఆయన ప్రధాన కర్తవ్యం.
మండలిలో బుక్కైన వైసీపీ..
శాసన సభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు, శాసన మండలికి మాత్రం వారు కచ్చితంగా హాజరవుతున్నారు. ఈ క్రమంలో జీఎస్టీ సంస్కరణలకు మద్దతుగా మండలిలో ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి వైసీపీ ఓటు వేయలేదు. అలాగని తీర్మానాన్ని తిరస్కరించనూ లేదు. కేవలం బీఏసీ సమావేశంలో ఆ తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కానీ సభలో మాత్రం వ్యతిరేకించలేదు. అంటే ఇక్కడ వైసీపీ డబుల్ గేమ్ క్లియర్ గా తెలుస్తోంది. పార్టీ అధినేత జీఎస్టీని పొగుడుతారు, మండలిలో ఆ పార్టీ సభ్యులు మాత్రం జీఎస్టీ సంస్కరణలకు మద్దతుగా తెచ్చిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయరు. పోనీ వ్యతిరేకంగా వేస్తే ఎక్కడ బీజేపీ ఆగ్రహానికి గురి కావలసి వస్తుందోనన్న భయం కూడా వారికి ఉంది. అందుకే ఓటింగ్ లో పాల్గొనకుండా బయటకు వెళ్లిపోయారు వైసీపీ సభ్యులు.
జీఎస్టీ సంస్కరణలపై
జగన్ డబుల్ గేమ్..జీఎస్టీతో 55 లక్షల కోట్లు దోచుకున్నారని చెప్పిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్సా.. జీఎస్టీ సంస్కరణలు అద్భుతం అంటూ ట్వీట్ చేసిన పులివెందుల ఎమ్మెల్యే..
బీఏసీ సమావేశంలో జీఎస్టీ సంస్కరణలకు మేము వ్యతిరేకం అని చెప్పి, మండలిలో మాత్రం అభిప్రాయం… https://t.co/hHCxVV9oYo pic.twitter.com/RUwuDfB2ZQ
— Telugu Desam Party (@JaiTDP) September 22, 2025
కేసుల భయమేనా?
జగన్ చుట్టూ ఉన్న పాత కేసులతోపాటు, వైఎస్ వివేకా హత్య కేసు కూడా ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అధికారంలో లేడు కాబట్టి.. కేంద్రం కనుసైగ చేస్తే ఏదో ఒక కేసులో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశముందని అంటున్నారు. ఆ కేసులబారినుంచి తప్పించుకోడానికే ఆయన మోదీని ప్రసన్నం చేసుకునే పనుల్లో బిజీగా ఉంటారనేది వైరి వర్గాల వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా.. జగన్ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రంలోని ఎన్డీఏకి జై కొడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.