AP Rains: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు.
గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు బుధవారం లోపు తిరిగి రావాలని సూచించింది. అలాగే వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
సోమవారం(సెప్టెంబర్ 22) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని సూచించింది.
ఆదివారం రాత్రి 7గంటలకు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 69.5 మి.మీ, చిత్తూరు జిల్లా యడమర్రిలో 61 మి.మీ అధిక వర్షపాతం నమోదైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.43 లక్షల క్యూసెక్కులు ఉందని, దాదాపు మొదటి హెచ్చరిక స్థాయి వరకు వరద ప్రవాహం చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Also Read: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!
శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.76, ఔట్ ఫ్లో 3.51 లక్షల క్యూసెక్కులు కాగా.. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.42, ఔట్ ఫ్లో 3.47 లక్షల క్యూసెక్కులు ప్రవాహం ఉందన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.5 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద సాయంత్రం 6 గంటలకు ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో 4.88 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు.
ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.