AP Free Coaching: ఏపీలోని అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబరు 6 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా పోటీ పరీక్షలకు శిక్షణ ఉంటుందని, శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఐబీపీఎస్, ఆర్.ఆర్.బి, ఎస్ఎస్సీతో ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. ఆసక్తిగల అభ్య ర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీరికి ఆయా జిల్లా కేంద్రాల్లో అక్టోబర్ 12న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు విధానం, ఇతర వివరాలకు 9949686306 నెంబర్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ప్రభుత్వం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తుంది. వివిధ ప్రభుత్వ పరీక్షలకు ఫ్రీ కోచింగ్, గైడెన్స్ , మెటీరియల్ అందజేస్తుంది. ఆశావహులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు నాణ్యమైన విద్య, సమగ్ర పరీక్ష విధానంతో శిక్షణ ఇస్తుంది. అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ అనేది ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం, ఇది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తుంది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఏపీపీఎస్సీ గ్రూప్స్ పాటు రైల్వేస్, బ్యాంక్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ అందిస్తారు. ఏపీకి చెందిన అభ్యర్థులకు పోటీ పరీక్షలలో విజయావకాశాలను మెరుగుపరిచేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అన్ని అంశాలను కవర్ చేసే సమగ్ర పాఠ్యాంశాలను అభ్యర్థులకు అందిజేస్తారు. అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన బోధకులచే శిక్షణ కూడా అందజేస్తారు.
Also Read: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?
ఉచిత విద్యా బోధనతో పాటు, వసతి, భోజన సౌకర్యాలు ఉచితంగా అందజేస్తారు. అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలతో లైబ్రరీ, మాక్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. నిపుణులతో సలహాలు, గైడెన్స్ అందజేస్తారు.