నిడిగుంట అరుణ. ఈ పేరు చెబితేనే నెల్లూరు జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులు, మరికొందరు అధికారులు హడలిపోతున్నారు. అరుణ అరెస్ట్ తర్వాత ఆమెనుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు సెల్ ఫోన్లలో ఏ సమాచారం ఉందోనని టెన్షన్ పడుతున్నారు. అయితే అసలు అరుణకు సాయం చేసింది ఎవరు? అరుణ ప్రియుడు శ్రీకాంత్ కి పెరోల్ మంజూరయ్యేలా చేసింది ఎవరు? ఆ కీలక పాత్రధారి, సూత్రధారి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు..
అరుణ ప్రియుడు శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వాల్సిందిగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన విషయం వాస్తవమేనని తేలింది. అయితే వారి సిఫార్సు లెటర్స్ ని హోం శాఖ జాయింట్ సెక్రటరీ కె.వి.కిషోర్ కుమార్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అరుణ వ్యవహారం బయటపడటంతో ఎమ్మెల్యేలు తమ నిజాయితీ నిరూపించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీకాంత్ తల్లి అభ్యర్థనతోనే తాను పెరోల్ కోసం సిఫార్సు లెటర్ ఇచ్చానని, అయినా తన లెటర్ ని హోం శాఖ పరిగణలోకి తీసుకోలేదని ఆయన చెబుతున్నారు. ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అరుణ విషయంలో ఇరకాటంలో పడ్డారు. ఆయన నేరుగా మీడియా ముందుకు రాకపోయినా.. ఆయన తరపున చేసిన సిఫార్సు రిజెక్ట్ అయినట్టుగా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్.. శ్రీకాంత్ పెరల్ కోసం ఇచ్చిన సిఫారసు లేఖలను రిజెక్ట్ చేస్తూ హోం శాఖ జాయింట్ సెక్రటరీ కె.వి కిషోర్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులు ఇవేనంటూ రెండు లెటర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
జులై 16వ తేదీన ఇద్దరు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిందని అంటున్నారు. అయితే అసలు శ్రీకాంత్ పెరోల్ కి సహకరించిన అదృశ్య శక్తి ఎవరనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
జులై 16వ తేదీన ఇద్దరు ఎమ్మెల్యేలు, శ్రీకాంత్ పెరోల్ కోసం ఇచ్చిన సిఫారసు లేఖలను తిరస్కరించినట్లు హోం శాఖ జాయింట్ సెక్రటరీ ప్రకటించారు. కానీ జులై 30న శ్రీకాంత్ కి పెరోల్ వచ్చింది. ఎమ్మెల్యేల లేఖలే బుట్టదాఖలైతే అంతకంటే బలంగా సిఫారసు చేసినవారెవరు..? ఎమ్మెల్యేల లేఖలను వద్దన్న హోం శాఖ ఇంకెవరి ఒత్తిడితో పెరోల్ ఇచ్చిందో తేలాల్సి ఉంది. ఆ బలమైన సిఫార్సు ఎవరిదా అంటూ గుసగుసలు వినపడుతున్నాయి. మరోవైపు వైసీపీ కూడా ఈ విషయంలో స్వరం పెంచింది. గతంలో నిడిగుండ అరుణ వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉన్నా.. ఇప్పుడు శ్రీకాంత్ పెరోల్ కి సిఫారసు లేఖలు ఇచ్చింది మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు కావడంతో సీన్ రివర్స్ అయింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అరాచక శక్తులను టీడీపీ ఎమ్మెల్యేలు పెంచి పోషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందో, అరుణకోసం బలంగా సిఫారసు చేసిన ఆ అదృశ్య హస్తం ఎవరిదో వేచి చూడాలి.