Big Stories

Jagan : జగన్ ఢిల్లీ టూర్ అందుకేనా..? కేంద్రం భరోసా ఇచ్చిందా..?

Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ 2రోజులపాటు ఢిల్లీలో పర్యటించారు. జగన్ రెండువారాల వ్యవధిలోనే రెండోసారి ఢిల్లీకి ఎందుకెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత పర్యటనలో మోదీని కలిసిన సీఎం.. తాజాగా అమిత్ షా తో భేటీ కావడం ఆసక్తిని రేపింది. సీఎం హస్తిన పర్యటనలపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. వివేకా హత్య కేసు మెడకు చుట్టుకుంటుందనే భయంతోనే సీఎం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆరోపిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల కోసమే సీఎం ఢిల్లీకి వెళ్లారని వైసీపీ నేతలు అంటున్నారు.

- Advertisement -

బుధవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ దాదాపు 30 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం.. రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లైనా ఏపీకి సంబంధించిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని అమిత్ షా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. పోలవరం ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అమిత్ షాకి సీఎం చెప్పారు. పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకురాని రూ.56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇవ్వడం వల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోందని తెలిపారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా కేంద్రం మంజూరు చేసిన 3 మెడికల్‌ కాలేజీలతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 14 మాత్రమే ఉన్నాయని చెప్పారు. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

- Advertisement -

గురువారం ఉదయం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తోనూ జగన్ భేటీ అయ్యారు. ఉపాధి హామీ పథకం బకాయిలు రూ.2,500 కోట్లు ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆ నిధులు మంజూరు చేయాలని కోరారు. రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించిందని నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించిందని తెలిపారు. కేంద్రం 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించిందని ఆ తర్వాత ఈ పరిమితిని రూ.17,923 కోట్లుకు కుదించిందని నిర్మలా సీతారామన్ దృష్టికి జగన్ తీసుకెళ్లారు. రుణపరిమితి విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి తెలంగాణ నుంచి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని.. ఆ బకాయిలను వెంటనే ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్లు పెండింగులో ఉన్నాయని ఆ నిధులను విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం డయాఫ్రమ్‌వాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు రూ.2,020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని నిర్మలా సీతారామన్ కు జగన్ తెలిపారు. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిన రూ.2,600 కోట్లను విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ.55,548 కోట్లుగా నిర్థారించిందని దీనికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు.

అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో భేటీలో ఇలా అనేక అంశాలను సీఎం ప్రస్తావించారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరి కేంద్రం ఎలాంటి హామీ ఇచ్చిందన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. నిధులు విషయంలోగానీ , పెండింగ్ బకాయిల అంశంలోగానీ కేంద్రం భరోసా ఇచ్చిందా? ఆ విషయంలో సీఎం జగన్ గానీ, కేంద్రం మంత్రులు గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం కొసమెరుపు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News