Pawan Kalyan : విజయనగరం జిల్లా గుంకలాం . ఈ గ్రామం పేరు ఇప్పుడు పత్రికల్లో పతాక శీర్షిక అయ్యింది. ఎలక్ట్రానిక్ మీడియాలో రెండురోజులుగా ఇదే పేరు వినిపిస్తోంది. అసలు జనసేన అధినేత గుంకలాంకు ఎందుకు కెళ్లారు? అక్కడ ప్రజలకు ఎదురైన ఇబ్బందులేంటి? ఈ సమాధానాలు తెలుసుకోవాలంటే పెద్ద కథే ఉంది. రెండేళ్ల క్రితం గుంకలాంలో 397 ఎకరాల్లో లేవుట్ ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 12,301 ప్లాట్లుగా విభజించింది. 11,828 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అందులో 10,625 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2020 డిసెంబర్ 30న లేఔట్ లో శంకుస్థాపన చేశారు.ఇది రాష్ట్రంలోనే పెద్ద లేఔట్ అని ప్రకటించారు.ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేవని హామీ ఇచ్చారు.
ఈ లేఔట్ నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాలనీలో శ్లాబు వరకు 42 ఇళ్లను మాత్రమే నిర్మించారు. ఇంకా చాలా ఇళ్ల నిర్మాణాలు పునాది స్థాయిలోనే నిలిచిపోయాయి. గుంకలాంలోని జగనన్న కాలనీకి సిమెంట్,ఐరన్, ఇటుకలు, ఇసుక తెచ్చే వాహనాలు మట్టిరోడ్లపై దిగబడిపోతున్నాయని లబ్ధిదారుల ఆవేదన.దీంతో నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. గృహ నిర్మాణాలు జరగాలంటే నీరు అవసరం. పైపులైన్లు సక్రమంగా పనిచేయక పోవటంతో నీటి వసతి సరిగాలేదని లబ్ధిదారులు చెబుతున్నారు.లేఅవుట్ లో రోడ్లు,నీరు,విద్యుత్ లాంటి మౌలిక వసతులు లేని కారణంగా కొంతమంది లబ్ధిదారులు వారి స్థలాలను అమ్మకానికి పెడుతున్నారని తెలుస్తోంది.
జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంకలాంలో పర్యటించారు. ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.లబ్ధిదారులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వంపై జనసేనాని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడంలేదని విమర్శించారు. రెండేళ్లైనా ఎందుకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనసేనాని ఈ ఒక్క కాలనీతో సరిపెడతారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నిర్మిస్తున్న జగనన్న కాలనీలను సందర్శిస్తారా? చూడాలి మరి. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఏ పని చేపట్టినా మధ్య వదిలేస్తారనే అపవాదు ఉంది. ఏపీలో రోడ్లు సరిగా లేవంటూ గతంలో ఓ కార్యక్రమం చేపట్టారు. ఒకేరోజు రాజమండ్రి, అనంతపురం రహదారిపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అక్కడితో వదిలేశారు. పవన్ కల్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రచారం కోసమేనని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు.