అధికారానికి తొలి మెట్టు పాదయాత్ర అనేది ఏపీ రాజకీయాల్లో బాగా బలపడిపోయిన నమ్మకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మొదలు పెడితే, ఆ తర్వాత చాలామంది నాయకులు పాదయాత్రలతో తమ పలుకుబడి పెంచుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పార్టీలతో సంబంధం లేకుండా పాదయాత్రలు అందరికీ బాగా వర్కవుట్ అయ్యాయి. 2019లో యాత్ర ద్వారా క్లిక్ అయిన జగన్, 2024లో దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. జనంలోకి వెళ్లకపోయినా తనకు 175 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. కానీ 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. అదే సమయంలో నారా లోకేష్ యువగళంతో జనంలోకి వెళ్లి టీడీపీకి పునర్వైభవం తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు జగన్ మనసు మళ్లీ యాత్రపైకి మళ్లింది. ఎన్నికల టైమ్ లో తిరిగి తన యాత్ర ఉంటుందని తాజాగా స్పష్టం చేశారు జగన్.
నేతల నుంచి ఒత్తిడి..
గతంలో జగన్ ఓదార్పు యాత్ర ద్వారా పార్టీని పటిష్టపరచుకున్నారు. ఆ తర్వాత పాదయాత్ర ద్వారా ఏకంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈసారి కూడా అధికారంలోకి రావాలంటే యాత్ర ఖాయం అని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే ఎన్నికలైపోయిన ఏడాది తిరిగేలోగా యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు జగన్. అది ఎప్పుడు, ఎలా అనేది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు. జగన్ యాత్ర గురించి ప్రకటించగానే, వైసీపీ నేతలు హర్షాతిరేకాలు ప్రకటించడం విశేషం. అంటే ఆయన యాత్ర చేయాలని నాయకులు కూడా గట్టిగా పట్టుబడుతున్నారని అర్థమవుతోంది.
సోషల్ మీడియాలో జోకులు..
జగన్ యాత్రపై అప్పుడే సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. కోడికత్తి, గులకరాయి డ్రామాలు మరిన్ని చూడాల్సి వస్తుందేమోనని అంటున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరు జగన్ యాత్రలో ఎన్నెన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని పెదవి విరుస్తున్నారు. జగన్ యాత్ర వల్ల ప్రజలకు ఒరిగేదేంటి అంటే కచ్చితంగా ఏమీ ఉండదనే చెప్పాలి. ఆల్రడీ 2019లో ఆయన యాత్ర చేశారు, ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి నిజంగానే ఆ కష్టాలు తీరిపోయి ఉంటే, ఆయన ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే 2024లో అధికారంలోకి వచ్చి ఉండేవారు కదా. అవేవీ చేయలేదు అని ప్రజలు నమ్మబట్టే ఆయనకు 11 స్థానాలిచ్చి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేశారు. అంటే తాను చేయాల్సింది యాత్ర కాదు, ప్రజలకు మంచి అనేది జగన్ తెలుసుకుంటే మంచిదని వైరి వర్గాలు సెటైర్లు పేలుస్తున్నాయి.
పాదయాత్ర చేస్తేనే ప్రజలు ఆదరిస్తారా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. అయితే యాత్ర చేసినవారంతా అధికారంలోకి వస్తుండటంతో జగన్ కి మళ్లీ దానిపై మనసు మళ్లింది. అందుకే ఎన్నికలకు నాలుగేళ్ల ముందుగానే యాత్ర గురించి హింటిచ్చారు. ఇప్పటికే వివిధ కారణాలతో జగన్ జనంలోకి వెళ్తున్నారు. ఆయన పర్యటనలకు విపరీతమైన ఆదరణ వస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అదంతా పేటీఎం బ్యాచ్ హడావిడి అని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఈరోజుల్లో రాజకీయ నాయకుల సభలకు, సమావేశాలకు ఎంతమంది స్వచ్ఛందంగా తరలి వస్తారనేది ఆలోచించాల్సిన విషయమే. జగన్ లాంటి వ్యక్తిని దగ్గరగా చూసేందుకు జనం ఆసక్తి చూపించవచ్చు కానీ, వారంతా రేపు ఎన్నికల్లో ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటే. అదే నిజమైతే.. సిద్ధం సభలకు వచ్చారని చెప్పుకుంటున్న జనమంతా ఏమైపోయారు, ఎవరికి ఓటు వేశారు. వైనాట్ 175 అంటేనే ఆ లెక్క 11 దగ్గర ఆగింది. మరిప్పుడు జగన్ కొత్త యాత్రకు ఏ లెక్క చెబుతారో చూడాలి.