Pawan Kalyan:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమిళనాడు షాక్ ఇచ్చింది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో పవన్ పై క్రిమినల్ కేసు నమోదయ్యింది. గతనెల పవన్.. తమిళనాడు మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొన్న విషయం తెల్సిందే. పంచెకట్టుకొని విభూది పెట్టుకొని ఆ వేడుకలో పాల్గొన్నాడు పవన్. ఇక ఆ సభలో పవన్ నిబంధనలను ఉల్లంఘించాడని, మత విద్వేషాలను రేకెత్తించేలా ప్రసంగం చేసాడని అడ్వకేట్ వాంజినాతన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులుపవన్ పై 196(1)(a), 299, 302, and 353(1)(b)(2) సెక్షన్ల కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు. మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నించాడని, ఆయనతో పాటు అన్నామలై పై కూడా కేసు నమోదు చేశారు.
ఇక ఆ సభలో పవన్ మాట్లాడుతూ.. కొందరు నాస్తికులు దేవుడి పేరు చెప్పుకొని బతుకుతున్నారు. కేవలం హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారు. క్రైస్తవులు, ముస్లిమ్స్ వారి మతాలను ఆచరించొచ్చు కానీ, హిందువులు తమ మతాన్ని ఆచరిస్తే మాత్రం తప్పుపడుతున్నారు. హిందు ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తున్నారు. వారిది సెక్యులరిజం కాదు సూడో సెక్యులరిజం. మురుగన్‌ను నమ్మితే శక్తి వస్తుంది. స్కంధ షష్టి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది. మన జీవితాన్ని మధురంగా మార్చుతుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వంటి డీఎంకే నేతలు చేసిన విమర్శలపై పరోక్షంగా స్పందించాడు. ఎలుకలు ఎన్ని ఉన్నా.. ఒక్క నాగుపాము బుస కొడితే మొత్తం పారిపోతాయని చెప్పుకొచ్చాడు. హిందువులను ప్రశ్నించిన విధంగా అరేబియన్ నుంచి వచ్చినవారిని ప్రశ్నించే దమ్ము ఉందా అని ఫైర్ అయ్యాడు.
ఇక పవన్ వ్యాఖ్యలు తమిళనాడులో ప్రభంజనం సృష్టించాయి. రాజకీయ నాయకులు, నటులు.. పవన్ పై విమర్శలు గుప్పించారు. నటుడు సత్యరాజ్ అయితే పవన్ పై మండిపడ్డాడు. దేవుడితో రాజకీయాలు చేయవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు.దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే ఊరుకోం. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను ఎవరూ మోసం చేయలేరు అంటూ కట్టప్ప చెప్పుకొచ్చాడు. ఇక సత్యరాజ్ మాత్రమే కాకుండా మంత్రులు కూడా ఫైర్ అయ్యారు. ఇప్పటివరకు ఈ వివాదంపై పవన్ స్పందించింది లేదు. ఇక ఆమాటలు విన్న ఎవరికైనా పవన్ మత విద్వేషాలను రేకెత్తించేలానే మాట్లాడాడని అనిపిస్తుంది. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం తప్పు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వివాదం కోర్టు, కేసు వరకు వెళ్ళింది. మరి పవన్ దీనిపై ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.
ఇక పవన్ సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. హరిహర వీరమల్లు జూలై 24 న రిలీజ్ కానుండగా.. ఓజీ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ రెండు కాకుండా పవన్ నటిస్తున్న మూడో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే సెట్స్ పైకి వెళ్ళింది. త్వరలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది.