Winter Weather Report: తెలుగురాష్ట్రాల్లో చలిపంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్టోగ్రతలు నమోదు కావటంతో వృద్ధులు, చిన్నారులు ఇక్కట్లు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండడంతో చలి తీవ్రత రోజురోజూకీ పెరుగుతోంది. పాడేరు పరిధిలో 9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. రెండు రోజులుగా ఏజెన్సీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం వింటర్ సీజన్ కావడం.. దీంతోపాటు ఉత్తరాది ప్రాంతాల నుంచి వీస్తున్న చలిగాలులు కారణంగా చలి తీవ్రత మరింత పెరుగుతుంది. మధ్యాహ్న వేళల్లో మినహా మిగతా సమయాల్లో ఎండ ప్రభావం అంతగా లేదు. చలిమంటలతో పాటు ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి నుంచి జనం రక్షణ పొందుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి గడగడలాడిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా మంచుదుప్పటిని కుప్పుకున్న పరిస్థితి నెలకొంది. సాయంత్రం అయిదు గంటలు దాటితే చాలు.. చలి నుంచి తమను తాము కాపాడుకునేందుకు జనం పాట్లు పడుతున్నారు. చలికి తోడు ఈదురుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా స్వెట్టర్లు ధరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం కూడా ఎనిమిది గంటలు దాటినా కాని ముసుగు తీయలేనంతగా గజగజ వణికిస్తోంది.
జోగులాంబ గద్వాల జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఫలితంగా చలి పంజా విసురుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్‌లో 11.8 డిగ్రీలు, అర్లి, నిర్మల్ జిల్లాలోని పెంబిల్లో 12 డిగ్రీలు నమోదయ్యాయి.
Also Read: అందాల విశాఖకు మెట్రో హంగులు.. త్వరలోనే నిర్మాణాలు ప్రారంభం
ఇదిలా ఉంటే ఓ వైపు చలి.. మరోవైపు వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల.. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి వాయు గుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల తర్వాత తమిళనాడు-శ్రీలంక తీరాలవైపు వెళ్లొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని తెలిపింది.
ఈ మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తోంది. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.