Machilipatnam Politics: మచిలీపట్నంలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వైసీపీ వర్సెస్ జనసేన అన్నమాదిరిగా రోజురో రచ్చ సాగుతోంది. బందరు మండలం సత్రంపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు వైసీపీ కార్యకర్త, ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్. దీనిపై ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు గిరిధర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు మచిలీపట్నంలో ఉద్రిక్తతకు దారి తీశాయి. వైసీపీ చేపట్టిన అన్నదాత పోరుబాటలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ కార్యకర్త, ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వైద్యుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ జనసేన కార్యకర్తలు ఆయన ఇంటి ముందు గురువారం రాత్రి ధర్నాకు దిగారు. పరిస్థితి గమనించిన ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ మోకాళ్లపై కూర్చొని మద్యం మత్తులో ఆ విధంగా మాట్లాడానంటూ క్షమాపణ చెప్పాడు. ఆయన చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది.
ఈ వ్యవహారం జరుగుతున్న నేపథ్యంలో గురువారం రాత్రి చిలకలపూడి పోలీసులు గిరిధర్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలియగానే వైసీపీ-జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలు ఒకరిపై మరొకరు స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని రియాక్ట్ అయ్యారు.
ALSO READ: తాడిపత్రిలో హై టెన్షన్.. పెద్దారెడ్డి ఇల్లు కూల్చివేత?
ఆర్ఎంపీ వైద్యుడిపై దాడిని తీవ్రంగా ఖండించారు. కార్యకర్తలతో కలిసి చిలకలపూడి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పేర్ని, డీఎస్పీని కలిసి దాడిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అధికారంతో జనసైనికులు రౌడీల మాదిరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని పోలీసులు ఉపేక్షిస్తే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయన్నారు.
జనసేన ముసుగులో విర్రవీగుతున్న రౌడీలను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై జనసేన నేత శాయన శివయ్య నోరు విప్పారు. డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిధర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరాని విధంగా చర్యలు ఉండాలన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతల్లో మార్పు రావడం లేదన్నారు. ప్రస్తుతానికి ఇరువర్గాలను శాంతపరిచారు పోలీసులు.