Vallabaneni Vamsi: వైసీపీ నేత,గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటికొచ్చే సూచనలు కనిపించడం లేదు. ముందుగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు తర్వాత వివిధ నేరారోపణలకు గానూ 8 కేసులు పెట్టారు. దీంతో అరెస్టైన మొదటి కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికి వేరే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా మరో రెండు కేసులు బుక్ అయ్యాయి. నకిలీ పట్టాల కేసులో వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది నూజివీడు కోర్టు. దీంతో.. ఈనెల 29 వరకు ఆయన రిమాండ్‌లో ఉండనున్నారు. దీంతోపాటు.. గన్నవరం పోలీసు స్టేషన్‌లో వంశీపై నిన్న మరో కేసు నమోదైంది. గన్నవరంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తరచూ కోర్టుల చుట్టూ విచారణలకు తిరుగుతూ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
గత 93 రోజులుగా జైలు గోడల మధ్య కుంగి కృశించిపోతున్నారు వల్లభనేని వంశీ. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు కోర్టుకు హాజరై బయటకు వచ్చిన సమయంలో ఆయన్ని చూసి జనం గుర్తు పట్టలేకపోయారు. సన్నగా అవడమే కాకుండా బాగా దగ్గు వస్తుండటంతో మూతికి కర్చీఫ్ అడ్డుపెట్టుకొనే నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పూర్తిగా నెరిసిన జట్టు రావడంతో వల్లభనేని వంశీని గుర్తు పట్టే పరిస్థితిలో లేరు. వంశీ ఆరోగ్యం పాడైందన్నారు ఆయన భార్య పంకజశ్రీ. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉందని చెప్పారామె. వంశీపై నమోదైన మరో కేసులో.. వాదనలు వినిపించారు లాయర్ విక్రమ్‌కుమార్. గతంలో తొలగించిన కేసును ఇప్పుడు అక్రమంగా బనాయించారని చెప్పారాయన. దీనిపై బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఆయన ఆరోగ్యం బాగోలేనందును.. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించిందని చెప్పారు లాయర్.
ప్రస్తుతానికి వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి, ఓ ఎస్సీ వర్గానికి చెందిన యువకుడ్ని కిడ్నాప్ చేశారనే కేసుల్లో ఆయన్ని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అటుపై జైల్లో పెట్టారు. ఇక్కడి వరకు అందరికి తెలిసిందే. అయితే మొదటి కేసులో కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాని వంశీని వేరే కేసుల చిక్కు ముళ్లు వదలడం లేదు.దీంతో ఆయన ఇప్పట్లో బయటికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదని ఓ వైపు వైసీపీ నేతలు మధనపడుతుంటే.. టీడీపీ నేతలు తగిన శాస్తే జరిగిందంటున్నారు.
Also Read: 20kgs వెయిట్ లాస్.. ఇవాళ, రేపా అన్నట్టుగా.. వంశీకి అసలు ఏమైందంటే..?
వంశీ వరుస కేసులతో జైళ్లోనే ఉంటున్నా, ఆనారోగ్యంతో బాధపడుతున్నా అయ్యో పాపం అనే నాథుడే కనిపించడం లేదు. వంశీ అరెస్ట్ అయినప్పుడు జైలుకొచ్చి పరామర్శించి వెళ్లిన జగన్ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. వంశీ ప్రియమిత్రుడు మాజీ మంత్రి కొడాలి నాని ముంబైలో శస్త్ర చికిత్స తర్వాత అసలెక్కడ ఉన్నారో కూడా ఆచూకీ తెలియడం లేదు . వైసీపీ నేతలు కూడా వంశీని మర్చిపోయినట్లు వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి గన్నవరం మాజీ ఎమ్మెల్యే జైలు గోడల మధ్య నుంచి ఎప్పుడు బయటపడతారో?