Big Stories

YCP Focus On TDP Seat: టీడీపీ ముఖ్యనేతల సెగ్మెంట్లపై వైసీపీ ఫోకస్.. గెలుపే లక్ష్యంగా వ్యూహం..

Share this post with your friends

AP Latest news

YCP Focus On TDP Seat(AP latest news): వైనాట్ 175 అంటున్న జగన్ ఆ దిశగా పెద్ద కసరత్తే చేస్తున్నారు. సర్వేల్లో నెగిటివ్ వచ్చిందంటూ ఎమ్మెల్యేలు, ఎంపీల సీట్లు గల్లంతు చేస్తున్నారు. టికెట్ దక్కని సిట్టింగులు పార్టీని వదిలేస్తున్నా పట్టించుకోకుండా.. ఆయ సెగ్మెంట్లకు కొత్త ఇన్చార్జిలను ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీకి కంచుకోట లాంటి సీట్లు, ఆ పార్టీ ముఖ్యనేతలు పోటీ చేసే నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మరీ ముఖ్యంగా కుప్పం, మంగళగిరి, హిందూపురం, టెక్కలి సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి వైనాట్ 175 అంటూ.. అభ్యర్ధుల మార్పులు చేర్పులు మొదలుపెట్టారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశానికి ఒక్కటంటే ఒక్కసీటు రాకుండా చేసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం కంచుకోట లాంటి సీట్లు, ముఖ్యనేతలు బరిలో దిగే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వైసీపీలోని కీలక నేతలకు అక్కడి బాధ్యతలు అప్పగించి నిరంతరం సమీక్షిస్తున్నారు. ఈ సీట్లలో పాగా వేసేందుకు సామ, దాన, దండోపాయలన్నీ వినియోగించడానికి రెడీ అవుతున్నారు.

మిగిలిన నియోజకవర్గా సంగతి ఎలా ఉన్నా.. ముఖ్యంగా మూడు, నాలుగు సీట్లపై సీఎం జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ తెలుగుదేశం విజయాన్ని అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోటీ చేసే కుప్పంతోపాటు ఆయన కుమారుడు లోకేశ్ బరిలో ఉండే మంగళగిరి, బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు సెగ్మెంట్ టెక్కలిపై స్పెషల్ ఫోకస్ పెట్టారంటున్నారు.

అందుకే ఆ నాలుగు నియోజకవర్గాల బాధ్యతలను వైసీపీలోని ఇద్దరి కీలక నేతలకు అప్పగించారు. ముఖ్యంగా చంద్రబాబు పోటీ చేయనున్న కుప్పం బాధ్యతలు ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సొంత నియోజకవర్గం కన్నా కుప్పంపైనే పెద్దిరెడ్డి ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నేతలను కనీసం నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు.

వరుసగా ఏడుసార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రబాబు నియోజకవర్గంలో మున్సిపాలిటీలు సహా పంచాయతీలు, జెడ్పీటీసీలను వైసీపీ పెద్దసంఖ్యలో కైవసం చేసుకుంది. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారంటే.. వైసీపీ ఈసీటుపై ఎంత ముందస్తుగా దృష్టిసారించిందో అర్థం చేసుకోవచ్చు.. దాంతో ఎప్పుడూ లేనంతంగా చంద్రబాబు సైతం పదేపదే కుప్పంలో పర్యటించి శ్రేణులకు భరోసా ఇవ్వాల్సి వస్తోంది.

అలాగే తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేయనున్న మంగళగిరిలో మరోసారి పాగా వేయాలని సీఎం జగన్ పట్టుదలతో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములను డిసైడ్ చేసే చేనేత కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు ఏడాది ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సామాజికవర్గంలో ఉన్న కీలక నేత గంజి చిరంజీవిని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేర్చుకున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.

పార్టీలో నెంబర్‌ 2గా ఉన్న విజయసాయిరెడ్డికి మంగళగిరిలో గెలుపు బాధ్యతలు అప్పగించారు. లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉండటంతో వైసీపీ లీడర్లు అక్కడ పనులు మెల్లగా చక్కబెడుతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని గ్రహించిన లోకేశ్ తక్షమే అప్రమత్తయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం కంచుకోట హిందూపురం బద్దలు కొట్టే బాధ్యతలు కూడా పెద్దిరెడ్డికే అప్పగించారంట.. అందుకే పెద్దిరెడ్డి బెంగళూరు నుంచి దీపికారెడ్డిని హిందూపురం ఇన్‌చార్జ్‌గా తీసుకొచ్చారు. ఆమె గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న ఆ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిరేయింబవళ్లు అక్కడే మకాం వేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా వాల్మీకి, బోయ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన బళ్లారి మాజీ ఎంపీ శాంతమ్మను ఇక్కడకు తీసుకొచ్చారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అసమ్మతివర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

నందమూరి కుటుంబానికి అనుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి మహిళా కార్డు ప్రయోగించి.. ఓట్లు కొల్లగొట్టడానికి పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వైసీపీ సీనియర్ నేత నవీన్ నిశ్చల్‌ను కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి చేశారు. తెలుగుదేశంలోని అసమ్మతి వర్గాన్ని సైతం ఆయన చేరదీస్తున్నట్లు తెలిసింది. మరి వైసీపీ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతయ్యో చూడాలి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News