YS Jagan on Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు. బన్నీ అరెస్టును ఖండించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి బన్నీకి అనుకూలంగా ట్వీట్ చేశారు.
సంధ్యా థియేటర్ దగ్గర ఒక మహిళ మృతి చెందటం బాధాకరమన్న వైఎస్ జగన్.. ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ తీర్చలేరని అన్నారు. ఘటనపై అల్లు అర్జున్ తన విచారం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తించాలని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాను అంటూ బాధ్యతగా వ్యవహరించారని అన్నారు. వేలాది మంది సినిమా చూసేందుకు వచ్చిన వారిలో ఓ మహిళ మృతి చెందటం బాధాకరమని.. దానికి ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమా అంటూ ప్రశ్నించారు. ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి.. అరెస్ట్ చేయడం సమ్మతం కాదని అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ ను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అల్లు అర్జున్ కు అండగా నిలిచారు.
గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మామయ్య పవన్ కళ్యాణ్ కు, జనసేనా పార్టీకి సపోర్ట్ చేయలేదు. పైగా వైయస్సార్సీపి అసెంబ్లీ అభ్యర్థికి మద్దతుగా ర్యాలీ నిర్వహించి వివాదాల్లో చిక్కుకున్నారు. అప్పటి నుంచి అల్లు అర్జున్ వైసీపీ మద్దతుదారుడిగా.. మెగా ఫ్యామిలీ అభిమానులే చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్ సొంత మామయ్యని కాదని జగన్ కు మద్దతుగా నిలిచారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ కావటం దానికి వైసీపీ నేతల నుంచి మద్దతు లభిస్తుండడం, మరోవైపు మెగా ఫ్యాన్స్ అందరూ స్తబ్దుగా ఉండిపోవడం ఆసక్తిగా మారింది. ఈ సమయంలోనే ఏకంగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందన
బన్నీ అరెస్ట్ వ్యవహారం తెలిసి తాను చాలా బాధపడ్డానని రామకృష్ణ రాజు ఓ వీడియో విడుదల చేశారు. అల్లు అర్జున్ హాజరైన బెనిఫిట్ షో కు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ సంగతి మర్చిపోవద్దని తెలిపారు. అదనపు షో, అదనపు డబ్బులు వసూలు చేసేందుకు అనుమతించిన ప్రభుత్వం… అలాంటి షోకు హీరోను హాజరు కావడాన్ని ఎలా తప్పవుతోందని ప్రశ్నించారు.
సినిమా థియేటర్ దగ్గర ప్రమాదం జరగడం.. అందులో ఓ మహిళ మృతి చెందడం దురదృష్టకరమన్న రఘు రామ కృష్ణరాజు… బాధిత కుటుంబానికి సినిమా బృందం అండగా నిలబడటం అభినందనీయమన్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ అరెస్టు చేయడం అత్యంత బాధాకరమని ఏపీ డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యానించారు. అత్యంత ప్రజాదరణ ఉన్న సినిమా హీరోలపై ఇలా వ్యవహరించడం సరైన విధానం కాదన్నారు. ఇలా చేస్తే సినిమా నటీనటులు ప్రజల్లోకి వచ్చేందుకు భయపడిపోతారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఓసారి ఆలోచించాలని కోరారు. మృతి చెందిన మహిళ భర్తే.. కేసును వాపస్ తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయన్న ఆర్ఆర్ఆర్.. కేసుతో బన్నీకి సంబంధం లేదని అతని విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అలాంటప్పుడు.. ప్రభుత్వం సైతం ఈ కేసు నుంచి బన్నీని తీసేయాలని సూచించారు.