BigTV English
Advertisement

YCP Struggle in Amaravathi: మూడు రాజధానుల ప్రకటన.. అమరావతిలో వైసీపీ మల్లగుల్లాలు

YCP Struggle in Amaravathi: మూడు రాజధానుల ప్రకటన.. అమరావతిలో వైసీపీ మల్లగుల్లాలు
AP breaking news today

YCP Struggle in Amaravathi(AP breaking news today):

అమరావతిని రాజధానిగా నిర్వీర్యం చేసే పనిలో పడిన వైసీపీ ఆ ప్రాంతంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. అమరావతి పరిధిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీకి దూరమయ్యారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన గత టీడీపీ ప్రభుత్వం ఏపీసీఆర్‌డీఏని అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు దాని పరిధిలో ఉన్న మిగిలిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు రాజధానిపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేక తెగ ఇదై పోతున్నారంట. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ కేపిటల్ కష్టాలు గట్టేక్కేది ఎలా అని దిక్కులు చూడాల్సి వస్తోందంట.


ఏపీలో ఎన్నికల నగారా మోగే టైం దగ్గర పడుతోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ చేసిన అభివృద్ధిని ఫోకస్ చేసుకుంటూ ఎలక్షన్స్‌కు ప్రిపేర్ అవుతుంది .. అయితే ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చెప్పుకుని జనంలోకి వెళ్లాలా అని మల్లగుల్లాలు పడుతున్నారంట. ఏపీ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని రాజధానిగా నిర్ణయించి ఏపీసీఆర్‌డీఏని ఏర్పాటు చేసింది. ఏపీసీఆర్‌డీఏ అధికారపరిధిలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లు, అటు జగ్గయ్యపేట నుంచి ఇటు సత్తెనపల్లి, పొన్నూరు, తెనాలి వరకు ఉన్న 9 మున్సిపాల్టీలు, ఉయ్యూరు పంచాయితీలను చేర్చారు.

అయితే వైసీపీ అధికారంలోకి రాగానే 3 రాజధానుల నినాదం ఎత్తుకుని అమరావతి ప్రాంత అభివ‌ృద్దిని పూర్తిగా అటకెక్కించేసింది .. దాంతో అమరావతికి భూములిచ్చిన రైతుల ఉద్యమం నిరంతరంగా కొనసాగుతూ వస్తోంది .. వారి న్యాయపోరాటంతో ఇంకా 3 రాజధానుల అంశం కోర్టు పరిధిలోనే ఉంది.. ఆ క్రమంలో 3 రాజధానుల ఏర్పాటులో వైసీపీ సర్కారు ఒక్క అడుగు కూడా వేయలేకపోతోంది.


తాడికొండ నియోజకవర్గంలో రాజధాని అమరావతి ఏర్పాటు చేసినా 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. ప్రచార సమయంలో రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్‌ సహా ఆపార్టీ కీలకనేతలు అందరూ పదేపదే ప్రకటించారు. దాన్ని నమ్మి ఓటర్లు వైసీసీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవిని గెలిపించారు. అయితే ఏడాది తిరక్కుండానే మూడు రాజధానుల ప్రకటన రావడంతో ఒక్కసారిగా రాజధానివాసులు విస్తుపోయారు. రోడ్డెక్కి ఆందోళన చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు సరికదా.. వారిపై పోలీసులను ప్రయోగించడం మొదలు పెట్టింది. కనీసం నిరసన తెలిపే అవకాశం ఇవ్వకుండా పోలీసు కేసులు, అరెస్టులతో రాజధానిలో భయానక వాతావరణం సృష్టించింది. అయినా అమరావతి ప్రాంత రైతులు వెనక్కి తగ్గడం లేదు.

నాలుగేళ్లుగా నిరంతరాయం రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ క్రమంలో తాడికొండ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే శ్రీదేవి కూడా జగన్‌ మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో విప్‌ ఉల్లంఘించారని వైసీపీ నుంచి అమెను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత ఆమె లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొని అమరావతిపై జగన్‌ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపణలు గుప్పించారు. రాజధాని విషయంలో గట్టిగా మాట్లాడలేక పోయినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పారు.

ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను తాడికొండ సమన్వయకర్తగా నియమించింది వైసీపీ. రోజుల వ్యవధిలోనే డొక్కా స్థానంలో కత్తెర సురేష్‌కుమార్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటినుంచి సురేష్‌కుమార్‌ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల సురేష్‌ను తప్పించి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను సమన్వయకర్తగా నియమించారు. ఈ పరిణామాలపై సామాజిక బస్సు యాత్ర వేదికగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. తన ప్రమేయం లేకుండానే తాడికొండకు సమన్వయకర్తగా నియమించడం, తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గం నుంచే డొక్కా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.

డొక్కా టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మూడు రాజధానుల బిల్లుకు మద్దతు ఇచ్చారు. పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి అక్కడ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పదేళ్లపాటు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న డొక్కా రాజధాని విషయంలో ఆ ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. స్వప్రయోజనాల కోసం అంత చేసిన డొక్కాకు తాడికొండ సీటు దక్కే పరిస్థితి లేకపోగా.. ఇప్పుడు కనీసం జగన్ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకడం లేదంట. ఇక కత్తెర సురేష్‌ పరిస్థితి సైతం కక్కలేక మింగలేక అన్నట్లు తయారైందంట.. రేపు ఎన్నికల్లో సుచరితకు తాడికొండ టికెట్ ఇచ్చినా.. డొక్కాతో పాటు సురేష్ ఆమెకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.

అమరావతి రాజధాని ప్రకటన నాటి నుంచి దానిని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో కేసులు వేసి అప్పటి ప్రభుత్వాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇబ్బంది పెట్టే ప్రయాత్నాలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో రాజధాని ఇక్కడే ఉంటుందని ఆ విధంగా జగన్‌ను ఒప్పిస్తానని పదేపదే చెప్పారు . ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే దానికి మద్దతుగా మాట్లాడారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు త్యాగాలు చేయలేదని వ్యాఖ్యానించి వారి ఆగ్రహానికి గురయ్యారు.

2019లో కృష్ణానదికి వరదల సమయంలో రాజధానిని ముంపు ప్రాంతమంటూ వివదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆర్కే. రాజధానిలో రైతులు నాలుగేళ్లుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కనీసం పలకరించిన పాపాన పోలేదు. జగన్‌ సర్కారు కోసం అంత చేసినా.. నాలుగేళ్ల తర్వాత ఆయన సీన్ రివర్స్ అయింది. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందంటూ.. వైసీపీకీ, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలకు న్యాయం చేయలేకపోయానని ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు. మంగళగిరి అభివృద్ధిని టీడీపీ నిర్లక్ష్యం చేసిందని పదేపదే విమర్శలు గుప్పించిన ఆళ్ల ఇప్పుడు అవే ఆరోపణలు జగన్‌పై చేస్తున్నారు. మొత్తానికి మంగళగిరి నుంచి 2 సార్లు గెలుపొందిన ఆయన.. ఇప్పుడు అక్కడ ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన గంజి చిరంజీవికి ఏకు మేకులా తయారయ్యారు.

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళగిరి నియోజకవర్గంలో కార్యకలాపాలు వేగవంతం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యువగళం పాదయాత్ర ముగిసిన నాటి నుంచి నియోజకవర్గానికి వచ్చి వివిధ వర్గాల వారిని కలుసుకుంటున్నారు. పార్టీ పరంగా విస్త్రృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను సొంత నిధులు వెచ్చించి ఆదుకుంటూ తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అమరావతి ప్రాంతంలో అధికారపక్షానికి కష్టాలు తప్పేటట్లు లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

.

.

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×