వక్ఫ్ సవరణ బిల్లుని వైసీపీ వ్యతిరేకిస్తోంది. లోక్ సభ, రాజ్యసభల్లో బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించింది. ఇన్నాళ్లూ ఎన్డీఏకి అన్ కండిషనల్ గా సపోర్ట్ ఇచ్చిన జగన్, సడన్ గా ఈ బిల్లుని వ్యతిరేకించడం వెనక పెద్ద కథే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజ్యసభలో వైసీపీ సపోర్ట్ కచ్చితంగా అవసరం అనుకున్నప్పుడల్లా జగన్ ఎన్డీఏ ప్రవేశ పెట్టిన బిల్లులన్నిటికీ మద్దతిచ్చారు. కానీ వక్ఫ్ బిల్లు విషయంలో మాత్రమే వ్యతిరేకిస్తానంటున్నారు. దీనికి అసలు కారణం ఈ బిల్లుని వైసీపీ వ్యతిరేకించినా కూడా పాస్ అయిపోతుంది. సో జగన్ అవసరం ఎన్డీఏకి లేదన్నమాట. అందుకే ముస్లింలవైపు నిలబడ్డానని జగన్క బుర్లు చెబుతున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. తాము బిల్లుని పూర్తిగా సమర్థించలేదని, సవరణలు చేసి వాటిని అమలు చేయించామని, కానీ జగన్ సవరణల జోలికి వెళ్లలేదని విమర్శిస్తున్నారు. కచ్చితంగా పాస్ అయ్యే బిల్లు కాబట్టే జగన్ మద్దతివ్వడం లేదని టీడీపీ నేతలు కౌంటర్లిస్తున్నారు.
ఆ అవసరం లేదు
వక్ఫ్ సవరణ బిల్లుకి వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేస్తుందనే నిర్ణయంతో జగన్ కి ఒక్కసారిగా ముస్లిం కమ్యూనిటీలో క్రేజ్ పెరిగిందని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఎన్డీఏని వ్యతిరేకించేంత సాహసం జగన్ చేయరు. ఒకవేళ బిల్ పాస్ కావాలంటే రాజ్యసభలో వైసీపీ మద్దతు కచ్చితంగా అవసరమైతే జగన్ మారు మాట్లాడకుండా తమ పార్టీ ఎంపీలతో అనుకూలంగా ఓటు వేయించేవారు. ఆ అవసరం లేదు కాబట్టే ఇప్పుడు ముస్లింలవైపు స్టాండ్ తీసుకున్నానని చెప్పుకుంటున్నారని టీడీపీ విశ్లేషిస్తోంది. అంతిమంగా జగన్ వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించినా, ముస్లింలకు మద్దతిచ్చేది టీడీపీయేనని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
లోక్ సభలో బలాబలాలు..
వక్ఫ్ సవరణ బిల్లు లోక్ సభలో గట్టెక్కాలంటే 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీకి సొంతగా 240 మంది ఎంపీల బలం ఉంది. ఆ పార్టీ మిత్రపక్షాలైన టీడీపీకి 16, జేడీయూకు 12 మంది ఎంపీలున్నారు. మిగిలిన మిత్రపక్షాలకు మొత్తం 14 మంది ఎంపీలున్నారు. సో టోటల్ గా ఎన్డీఏ కూటమికి మద్దతుగా 282 ఓట్లు పడతాయనే నమ్మకం వారికి ఉంది. అంటే లోక్ సభలో వక్ఫ్ బిల్లు పాస్ కావడం నల్లేరు మీద నడకే.
రాజ్యసభలో
రాజ్యసభలో కూడా ఎన్డీఏ సేఫ్ జోన్ లో ఉంది. రాజ్యసభలో బిల్ పాస్ కావాలంటే 119 మంది ఎంపీల మద్దతు అవసరం. బీజేపీకి సొంతగా 98మంది సభ్యుల బలం ఉంది. మిత్రపక్షాలతో కలుపుకొంటే 125 మంది ఉన్నారు. అందుకే వారు వైసీపీ మద్దతు కావాలని అడగలేదు, సో జగన్ సొంతగా ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బిల్ కి మద్దతు ఇవ్వబోనంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ముస్లింలపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు.
ఇక్కడ టీడీపీని కార్నర్ చేయాలని చూస్తోంది వైసీపీ. ముస్లింలను ఆ పార్టీకి వ్యతిరేకంగా మార్చాలనుకుంటోంది. కానీ ముస్లిం కమ్యూనిటీ కూడా నిజానిజాలను బేరీజు వేసుకుంటోంది. బిల్లు కి టీడీపీ మద్దతిస్తోంది, అదే సమయంలో కీలక సవరణలకోసం పట్టుబట్టి మరీ ముస్లింలకు మేలు జరిగేలా ప్రవర్తించింది. వైసీపీ కనీసం సవరణలు కూడా చెప్పలేదు. కేవలం బిల్లుని వ్యతిరేకిస్తామని మాత్రం చెప్పింది. అంటే బిల్ పాస్ కావడానికి పరోక్ష సహకారం అందిస్తున్నారు జగన్. మిగతా బిల్లుల విషయంలో ఎన్డీఏకి బేషరతుగా మద్దతిచ్చిన జగన్, ఈ ఒక్క బిల్లు విషయంలో లాజిక్ మాట్లాడటం వెనక ఇంత పెద్ద కథ ఉందన్నమాట.