Local Boy Nani – Sajjanar: నాని సారీ చెప్పాడు. ఇకపై అలాంటి పనులు చేయనంటూ ప్రామిస్ కూడా చేశాడు. అంతేకాదు తన ఫాలోవర్స్ తో పాటు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సైతం తనను క్షమించాలని వేడుకున్నాడు. అసలేం జరిగిందంటే..
సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారి భరతం పడుతున్న విషయం తెలిసిందే. తక్కువ కాలంలో డబ్బులు సంపాదించవచ్చని పలువురు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, అమాయకులైన ప్రజలను అప్రమత్తం చేసేందుకు సజ్జనార్ పలు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఎందరో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల దారుణాలకు బలైన ఘటనలు సైతం ఉన్నాయి. అటువంటి వారిని అప్రమత్తం చేసేందుకు సజ్జనార్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిని పలుమార్లు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ప్లూయెన్సర్ల వీడియోలను పోస్ట్ చేస్తూ ఇటువంటి ప్రకటనల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ సజ్జనార్ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. తాజాగా వైజాగ్ కు చెందిన మత్స్యకారుడు నాని విడుదల చేసిన ఓ బెట్టింగ్ ప్రమోషన్ కు చెందిన వీడియోను ఆయన ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ఇలాంటి మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనితో వైజాగ్ నానికి పలువురు బ్యాడ్ కామెంట్స్ చేయడంతో పాటు, ఇటువంటి వాటిని ప్రచారం చేసి యువతను దెబ్బతీయొద్దంటూ కోరారు.
సజ్జనార్ లాంటి పోలీసు అధికారి వీడియో పోస్ట్ చేయడంతో నానిపై నెటిజన్ల నుండి విమర్శల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నాని ఓ వీడియోని విడుదల చేశాడు. బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేసి తాను తప్పు చేశానని నాని ఒప్పుకున్నాడు. తాను చదువుకోలేదని, ఉన్నత చదువులు చదివిన వారు కూడా ప్రమోట్ చేసే విధానం చూసి మోస పోయానన్నాడు. ఇలాంటి ప్రమోషన్స్ చేయడాన్ని తాను తప్పుగా భావిస్తున్నట్లు వీడియో విడుదల చేశాడు. ఇకనుండి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయనని చెప్పుకొచ్చాడు.
తనను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ ను మోసం చేయడం తప్పుగా భావించానని, సరైన సమయంలో పోలీస్ అధికారి సజ్జనార్, తనను అప్రమత్తం చేశారని నాని అన్నాడు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఇక నుండి తాను ప్రమోట్ చేయనని ప్రకటించాడు. అంతేకాకుండా సోషల్ మీడియా ఫాలోవర్స్ కు సారీ చెబుతూ నాని ఆవేదనకు గురయ్యాడు.
నాని విడుదల చేసిన వీడియోను సజ్జనార్ పోస్ట్ చేసి బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ చేయనంటూ ప్రకటించడంపై అభినందిస్తూ.. మిగిలిన సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు మారకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు. ఎందరో అమాయకులు బెట్టింగ్ యాప్ లకు బలవుతున్న పరిస్థితులలో, సజ్జనార్ స్పందిస్తూ.. యువతను చైతన్య పరచడంపై నెటిజన్స్ అభినందనలు తెలుపుతున్నారు.