“చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా మూడేళ్లు ఇలాగే పోరాటం చేస్తే, ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టను. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం.” అంటూ పార్టీ నేతలకు ఉపదేశమిచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్. రాజంపేట, మడకశిర మున్సిపాల్టీ, రామకుప్పం, రొద్దం మండలాల వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చేది మన ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు.
సినిమా చూపిస్తా..!
కూటమి ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలు పడుతున్న బాధల్ని తాను చూశానని అన్నారు జగన్. జగన్ 2.0 మునుపటిలా ఉండదని, ఈసారి కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారాయన. కార్యకర్తలకు పూర్తి న్యాయం చేస్తానన్నారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని కార్యకర్తలు, నేతలకు సూచించారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆ లిస్ట్ లో ఉన్నవారందర్నీ చట్టం ముందు నిలబెడదామన్నారు. ఈరోజు చంద్రబాబు ఏ విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందని, తాము కూడా వారిలాగే రివేంజ్ తీర్చుకుంటామని స్పష్టం చేశారు. దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు జగన్. రిటైర్ అయినా సరే తన రివేంజ్ మామూలుగా ఉండదన్నారు. ఈ సారి సినిమా వేరే లెవెల్ లో ఉంటుందంటూ సినిమా డైలాగులు కొట్టారు జగన్. ఈసారి మారిన జగన్ ని చూస్తారని చెప్పుకొచ్చారు.
వైయస్ఆర్సీపీ కార్యకర్తల బాధలు, కష్టాల్ని స్వయంగా చూస్తున్నా.. అందుకే జగన్ 2.Oలో టాప్ ప్రయారిటీ కార్యకర్తలకే ఇస్తా
మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులు, అధికారుల పేర్లని రాసి పెట్టుకోండి
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సినిమా మామూలుగా ఉండదు.. వేరే లెవల్లో ఉంటుందంతే🔥… pic.twitter.com/fe9FO9IIDe
— YSR Congress Party (@YSRCParty) May 8, 2025
ఏపీలో కూటమి ప్రభుత్వం.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోందన్నారు జగన్. రాష్ట్రంలో దౌర్జన్యకర పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా వైసీపీ కార్యకర్తలు తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెబుతున్నారని మెచ్చుకున్నారు. విలువలు, విశ్వసనీయతవైపు నిలబడినవారందరికీ హ్యాట్సాఫ్ అన్నారు జగన్.
నాయకుడనేవాడు ఆదర్శంగా ఉండాలి కానీ.. చంద్రబాబులా ఉండకూడదన్నారు జగన్. తానెప్పుడూ మాట తప్పలేదని, విలువలు వదల్లేదని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చిందని, కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు నెలకొన్నాయని, ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగాయన్నారు. కానీ ఎప్పుడూ సాకులు చూపి తాను ప్రభుత్వ పథకాలు ఎగ్గొట్టలేదన్నారు జగన్. చిక్కటి చిరునవ్వుతో ఉన్నామని సమాధానమిచ్చారు. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని, బటన్ నొక్కి, మాట తప్పకుండా పని చేశామన్నారు.
వైసీపీ నేతలు, కార్యకర్తల్ని.. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని, ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదన్నారు జగన్. ఇలాంటి పనులు చేయడం వల్లే బాబు ప్రజల్లో చులకన అయ్యారన్నారు. హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు జగన్. ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది కాబట్టే.. ఒకరోజు తిరుపతి లడ్డూ, మరో రోజు సినీనటి కేసు అంటూ డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారని విమర్శించారు. తాను వ్యవస్థలను సరిదిద్దితే.. చంద్రబాబు ప్రభుత్వం వాటిని నాశనం చేసిందన్నారు జగన్.