YS Sharmila Visited Flood affected areas: భారీ వర్షాల కారణంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుడమేరు వరదలు పూర్తిగా మంచెత్తాయి. దీంతో వారు సర్వం కోల్పోయి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సింగ్ నగర్ ప్రాంతంలో గురువారం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. విజయవాడ ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో ఆదుకోవాలి. వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం మంచి విషయమని ఆమె పేర్కొన్నారు. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో హైడ్రా మాదిరిగా, బుడమేరు ఆక్రమణలు తొలగించాలంటూ కూటమి ప్రభుత్వానికి ఆమె సూచించారు.
Also Read: తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం భారీ విరాళం.. ఏపీ పంచాయతీలకు మరో రూ. 4 కోట్లు ?
‘కొంప కొల్లేరు అయ్యింది.. బెజవాడ బుడమేరు అయ్యింది. బుడమేర వల్లే విజయవాడలో వరదలు వచ్చాయి. వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాదం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుతం చంద్రబాబుపై ఉంది. బుడమేరుకు రిటర్నింగ్ వాల్ ను నిర్మించాలి. వరదల్లో ఇప్పటివరకు 35 మంది మృతిచెందారు. 5 లక్షల మంది నష్టపోయారు. ఇది ఘోర విపత్తు. ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే ప్రధాని మోదీ కనీసం స్పందించకపోవడం ఎంత వరకు కరెక్ట్? విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడంలేదా? ఇక్కడి ఎంపీల మద్దతుతో ప్రధాని అయ్యాననే సంగతి మరిచారు. ఏపీ ప్రజల కష్టాలు మోదీకి కనిపిచడంలేదు. కేంద్రం వెంటనే స్పందించి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి. నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం రూ. లక్ష సాయం అందించాలి’ అంటూ ఆమె డిమాండ్ చేశారు.