Chirala Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన మార్క్ చూపేందుకు కాంగ్రెస్ పార్టీ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన చీరాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 44 వార్డులకు గాను 42 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపి, ఏకంగా 10 స్థానాల్లో గెలుపొందడం కాంగ్రెస్ పునరుజ్జీవనానికి సంకేతమని ఆమె పేర్కొన్నారు. మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయినా, ప్రతిపక్ష పాత్రను దక్కించుకోవడమే కాంగ్రెస్ సాధించిన అసలైన నైతిక విజయమని స్పష్టం చేశారు.
ఆమంచి వ్యూహం.. కార్యకర్తల అంకితభావం
ఈ ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చూపిన చొరవను షర్మిల ప్రత్యేకంగా అభినందించారు. పిఎసి (PAC) సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నాయకత్వాన్ని మెచ్చుకుంటూ, ఆయన పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం అన్నారు. మిగిలిన స్థానాల్లో కూడా పార్టీని రెండో స్థానంలో నిలబెట్టడంలో ఆమంచి పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. అధికార కూటమి ప్రలోభాలకు, బలానికి లొంగకుండా ప్రజా పక్షాన నిలిచి పోరాడిన వార్డు సభ్యులను, రాత్రింబవళ్లు శ్రమించిన కార్యకర్తలను ఆమె అభినందించారు.
అసలైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ సేవలు
చీరాల ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులపై నమ్మకంతో ఓటేసి గెలిపించినందుకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అధికార కూటమి శక్తుల నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టేందుకు కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. స్థానికంగా ప్రజా సమస్యలపై గెలిచిన వార్డు సభ్యులు అంకితభావంతో పనిచేస్తూ.. ప్రజల గొంతుకగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీయే ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
Also Read: కౌంటింగ్ ముంగిట విషాదం.. జనసేన MPTC అభ్యర్థి మృతి!