Vijaya Sai Reddy: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీలో తీవ్ర పరిణామాల అనంతరం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? కొత్త పార్టీ ఏర్పాటు వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పొమ్మనకుండా పొగబెట్టారు..
వైసీపీలో తనకు జరిగిన అవమానాలు, అనుభవించిన వేదనను విజయసాయిరెడ్డి మీడియా ముందు తీవ్ర ఆవేదనతో పంచుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తనకు ఎంతో గౌరవం దక్కిందని, కానీ జగన్‌మోహన్ రెడ్డి వద్దకు వచ్చేసరికి కొందరు వ్యక్తుల చెప్పుడు మాటలు విని తనను తీవ్రంగా అవమానించారని ఆయన వాపోయారు. ‘నన్ను పార్టీ నుంచి నేరుగా పొమ్మనకుండా పొగబెట్టారు. ఆత్మగౌరవం చంపుకొని ఆ పార్టీలో కొనసాగలేకనే బయటకు వచ్చాను’ అని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగితే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఘాటు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
11న కొత్త పార్టీ ఆవిర్భావం!
ఈ నేపథ్యంలోనే నవంబర్ 11వ తేదీన సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేవలం రెండు కులాలు లేదా రెండు కుటుంబాల గుప్పిట్లో ఉండే పార్టీ కాకుండా, అన్ని సామాజిక వర్గాలకు, కులాలకు, మతాలకు సమాన ప్రాతిపదికన సమన్యాయం చేసేలా ఈ పార్టీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యాంబద్ధంగా ప్రతి ఒక్కరికీ దక్కాల్సిన హక్కుల అమలు కోసం ఈ వేదిక పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే విశాఖకు చెందిన బోనీ గణేష్, చిత్తూరుకు చెందిన సుమతి వంటి ప్రముఖులు తనతో కలిసి వచ్చారని, కొత్త పార్టీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.
పొలిటికల్ రీ-ఎంట్రీపై విజయసాయిరెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రాబోయే ఐదు రోజుల్లో పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు సాయిరెడ్డి స్పష్టం చేశారు. తాము పెడుతున్న ఈ కొత్త పార్టీకి మనుగడ ఉందో లేదో రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెబుతుందని, వేచి చూస్తే రాజకీయ సమీకరణాలు ఏంటో స్పష్టమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి, విజయసాయిరెడ్డి చేపట్టిన ఈ కొత్త ప్రయాణం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read: కేటీఆర్‌కు కాంగ్రెస్ ఓపెన్ ఛాలెంజ్.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపించగలవా?