Salur Elections: రాజకీయ అధికారంలోనే మత్తు ఉంటుంది కాబోలు. అది అంత గమ్మత్తైనది కాబట్టే పదవులకోసం నేతలు దేనికైనా రెడీ అంటారు. మున్సిపల్ పీఠం తన గుప్పెట్లో ఉండాలని ఆకాంక్షించిన ఓ టిడిపి నేత పదవి కోసం ఎన్నికల సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. టిడిపి తరపున భార్యను బరిలో దింపాలనుకుంటే కుదరక ఇండిపెండెంట్ గా పోటీ చేయించాడు. చివరకు ఆమె ఓడిపోవడంతో కొత్త పెళ్లికొడుకు ఉస్సూరు మన్నాడు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిపై టిడిపి నేత హర్షవర్ధన్ ఆశపడ్డాడు. మున్సిపల్ ఛైర్ పెర్సన్ పీఠాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో తాను ప్రేమించిన మహిళ మంజీరను ఆగమేఘాల మీద పెళ్లి చేసుకున్నాడు. అయితే కూటమి పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు. జనసేన తరపున గొర్రె విజయకుమారి బరిలో దిగారు. దాంతో భార్య మంజీరను స్వతంత్ర అభ్యర్ధిగా దగ్గరుండి నామినేషన్ వేయించారు హర్షవర్ధన్..
భార్యతో పాటు 21వ వార్డులో తాను కూడా పోటీ చేశారు. కొత్త జంట కాబట్టి తనకూ తన భార్యకూ ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఆశించారు. అయితే తానకొకటి తలిస్తే ఓటరు దేవుడు ఇంకోలా ఆలోచించాడు. జనసేన అభ్యర్ధిని గెలిపించారు ఓటర్లు. కొత్త పెళ్లి కూతురు మంజీరకు 6143 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచి మున్సిపల్ ఛైర్ పెర్సన్ భర్త అని పిలిపించుకోవాలన్న హర్షవర్ధన్ ఆశలపై జనం నీళ్లు కుమ్మరించారు. పదవికోసం పెళ్లి చేసుకున్న హర్షవర్ధన్ ఇక కొత్త కాపురంపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. కక్కొచ్చినా కల్యాణం వచ్చినా ఆగదంటారు. ఎలక్షన్లు వచ్చి కల్యాణం జరిగిపోయిందిలా..
Also Read: రూ.18 వేల ఖర్చుకి రూ.50 వేల బాదుడా? iPhone 18 Pro స్టోరేజ్ వెనుక యాపిల్ సీక్రెట్ దందా!