YS Sharmila Speech : ఏపీ హక్కులపై ఢిల్లీ వేదికగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరుబాట పట్టారు. కేంద్రంపై గళమెత్తారు.విభజన చట్టంలో హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి 10 ఏళ్లు కొనసాగిస్తామని గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు. తిరుపతి సభలో ప్రధాని మోదీ ప్రత్యేక హోదా గురించి ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారని వైఎస్ షర్మిల అన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ తీసుకువస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామన్నారన్నారు. ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇండస్ట్రియల్ కారిడార్లు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా ఇంకా ఎన్నో హామీలు విభజన చట్టంలో ఉన్నాయన్నారు షర్మిల. ఎన్నికల ప్రచారం సమయంలో మోదీ ఏపీలో పర్యటిస్తూ ఎన్నో హామీలు ఇచ్చారని.. అవన్నీ ఏమయ్యాయి? చట్ట సభలో ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఏమైంది? ప్రశ్నించారు. హైదరాబాద్ ను పదేళ్లు కామన్ క్యాపిటల్ గా ఉంచుతూ కొత్త రాజధాని నిర్మిస్తామన్నారు. పదేళ్లు గడిచాయి. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ లేకపోయింది. సొంత రాజధాని నగరం నిర్మాణం కాలేదని షర్మిల మండిపడ్డారు.
కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం.. వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం కాలేదని షర్మిల విమర్శించారు. ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ గెలవలేదని.. అయినా సరే రాష్ట్రంలో బీజేపీ రాజ్యమేలుతోందన్నారు. రాష్ట్రంలో పార్టీలన్నీ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నాయని ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ పర్యటనలో సీతారాం ఏచూరి సహా పలువురు నేతలను షర్మిల కలిశారు. ఏపీ విభజన హామీలను వారికి వివరించారు.