సూపర్ సిక్స్ హామీల్లో బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తోంది కూటమి ప్రభుత్వం. ఆగస్ట్-15నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతోంది. స్త్రీశక్తి పేరుతో ఈ పథకం అమలు చేసేందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. వాస్తవానికి ఈ పథకం విషయంలో ఎక్కడా ఎలాంటి కొర్రీలు లేవు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత రవాణా పథకం అమలులో ఉన్నట్టే ఏపీలో కూడా కొన్ని నామమాత్రపు మినహాయింపులున్నాయి. అయితే ఆ మినహాయింపులపైనే ఇప్పుడు వైసీపీ దృష్టిపెట్టింది. ఉచిత బస్సు అంటూ సవాలక్ష కండిషన్లు పెట్టారని వైసీపీ విమర్శిస్తోంది. అసలా పథకం అంతా తుస్సు అంటోంది.
మరోసారి మహిళలను మోసం చేసిన విజనరీ #Freebus pic.twitter.com/0qRgPW0tNx
— Graduate Adda (@GraduateAdda) August 11, 2025
గతంలో అలా..
కూటమి ప్రభుత్వం ఏ హామీని అమలు చేసినా ప్రతిపక్ష వైసీపీకి ఓ రేంజ్ లో జర్క్ లిస్తోంది. గతంలో తల్లికి వందనం పథకం ఒక్కరికేనంటూ ప్రచారం మొదలైంది. వైసీపీ కూడా విమర్శలు చేసింది. చివరకు కుటుంబంలోని పిల్లలందరికీ ఈ పథకం వర్తించడంతో విమర్శకులు నోరెళ్లబెట్టారు. క్రెడిట్ కూటమి ఖాతాలో జమ అయింది. స్త్రీ శక్తి పథకం విషయంలో కూడా వైసీపీ ఆల్రడీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. జిల్లాకే ఉచిత ప్రయాణం పరిమితం అంటూ ఓ పుకారు షికారు చేసింది. ఆ పుకారుతో వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. చివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుండటంతో వైసీపీకి ఛాన్స్ దొరకలేదు. దీంతో విమర్శలకోసమే సోషల్ మీడియాకు పనిచెప్పినట్టయింది.
కండిషన్లు ఇవే..
పొరుగు రాష్ట్రం తెలంగాణలో లాగే ఏపీలో కూడా ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత రవాణా పథకం అమలవుతుంది. తిరుమల కొండపైకి వెళ్లే వాహనాలలో రద్దీని నివారించేందుకు అక్కడ ఆ పథకం అమలు చేయడం లేదని ఆల్రడీ స్పష్టం చేశారు అధికారులు. వైసీపీ చేసే విమర్శలన్నీ వారిని నవ్వులపాలు చేస్తున్నాయే కానీ, పథకంపై అనుమానాలు రేకెత్తించలేకపోయున్నాయనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఈ పథకం విషయంలో వైసీపీ ఎంత సైలెంట్ గా ఉంటే, వారికి అంత మేలు అని అంటున్నారు. ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు, అల్ట్రా డీలక్స్ లలో ఈ పథకం అమలు చేయడం లేదు. మహిళలకు ఉచిత రవాణా ఓకే, అదే సమయంలో ఆర్టీసీ మనుగడ కూడా ప్రభుత్వ బాధ్యతే కదా. అందుకే ఈ పథకంలో కూడా కొన్ని నిబంధనలు పెట్టింది ప్రభుత్వం. ఆ నిబంధనలేవీ అభ్యంతరకరంగా లేవనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఆర్డీనరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఏపీలో ఎక్కడినుంచి ఎక్కడికైనా మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏదో ఒక గుర్తింపు కార్డు చూపెడితే సరిపోతుంది.
కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మరొక హామీ ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం 'స్త్రీ శక్తి' ప్రారంభం కానుంది.#SthreeShakti#FreeBusTravelForWomen#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/ZWW6V8m1G0
— Telugu Desam Party (@JaiTDP) August 11, 2025
అన్ని రకాల బస్సుల్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనవసర వివాదాలను నివారించేందుకు కండక్టర్లు దుస్తులకు ధరించే కెమెరాలు ఉపయోగిస్తారు. మహిళల ఉచిత రవాణా ద్వారా ఆర్టీసీ కోల్పోయే ఆదాయాన్ని ఇతర విధాలుగా సమకూర్చుకునేట్టుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అంటే ఒకరకంగా ఆర్టీసీకి కూడా ఇది ఉపయోగకరమేనని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో ఈ పథకంతో మహిళలు చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో కూడా మహిళలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న వరంగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ దశలో వైసీపీ పసలేని విమర్శలు చేస్తూ నవ్వులపాలవుతోందని అంటున్నారు నెటిజన్లు.