జగన్ పొదిలి పర్యటన ఓ రేంజ్ లో జరిగిందని ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు వైసీపీ నేతలు. జగన్ కాలు బయటపెడితే చాలు జనం తండోపతండాలుగా వచ్చేస్తారని అంటున్నారు. పోనీ అది నిజమేననుకుందాం. జగన్ క్రౌడ్ పుల్లర్ కావొచ్చు. ఎన్నికల సమయంలో సిద్ధం సభలకు కూడా జగనం బాగానే వచ్చారని చెప్పుకున్నారు. మరి వైనాట్ 175 ఏమైంది. అతి విశ్వాసంతో కొంప మునిగింది. ఇప్పుడు కూడా రోడ్లపై గుమికూడే జనాన్ని చూసి, నెక్ట్స్ అధికారం మాదే అని వైసీపీ అతి విశ్వాసంతో చెబుతోంది. దానికింకా టైమ్ ఉంది. సూపర్ సిక్స్ సక్రమంగా అమలైతే జగన్ తో పనేంటి అని అనుకుంటారు జనం.
ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు మద్దతు ధర లేక అల్లాడుతున్న రైతన్నల కోసం గళం విప్పేందుకు వచ్చిన జగనన్న.. జననేతకి జేజేలు కొడుతూ వచ్చిన జనం..#YSJaganForFarmers#CBNFailedCM#SadistChandraBabu pic.twitter.com/oCJUBc6trF
— YSR Congress Party (@YSRCParty) June 11, 2025
ఏడాదిలోనే అంత మార్పా..?
ఏడాదిలోనే ఏపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారని అంటున్నారు వైసీపీ నేతలు. ఇందులో ఎంత నిజం ఉందో ముందు ముందు తేలిపోతుంది. ఐదేళ్లలో జగన్ ఇవ్వలేని పెన్షన్ పెంపుని అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే చంద్రబాబు చేసి చూపించారు. మరి ఇది కూటమి గొప్పతనమే కదా. డీఎస్సీ పేరుతో వాయిదాల పర్వం నడిపారు జగన్, కానీ చంద్రబాబు డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం పెట్టారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, తల్లికి వందనం డేట్ ఫిక్స్ చేశారు. ఇంత చేస్తున్నా ఇంకా సూపర్ సిక్స్ లో మిగిలినవాటి మాటేంటి అని జగన్ అడుగుతున్నారు. నిజంగా జగన్ ది లాజిక్కే. ఇంకా కూటమికి నాలుగేళ్లు అధికారంలో ఉంది. ఒక్కొక్క హామీని నెమ్మది నెమ్మదిగా పట్టాలెక్కిస్తూ వస్తే ఎన్నికల ఏడాదిలో ఇక వైసీపీకి ప్రశ్నించే అవకాశం ఎక్కడ ఉంటుంది. పోనీ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ గొడవచేస్తారనుకుంటే.. ఆ రెడ్ బుక్ బాధితులు ఎవరు..? కేవలం వైసీపీ నాయకులు. అందులోనూ ఎంతోకొంత తప్పు చేసినవారే జైలుకి వెళ్తున్నారు. వల్లభనేని వంశీ, కాకాణి, ఇతరత్రా కొందరు నేతలే జైలుకెళ్లారు కానీ, పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వారు బయటే హ్యాపీగా ఉన్నారు కదా. అంటే రెడ్ బుక్ అందరికీ కాదు, తప్పు చేసిన వారికే అని స్పష్టమవుతోంది. అందులోనూ వైసీపీ నేతలు జైలులో ఉంటే సామాన్య జనం ఎందుకు బాధపడతారు. ఆ కేసులతో వారికి పనేంటి..? వల్లభనేని వంశీ అసలు బెయిలే లేకుండా జైలులో కాలం గడుపుతున్నారు. ఆయనపై సొంత నియోజకవర్గంలో అయినా సింపతీ వచ్చిందా..? సో జగన్ బయటకు వస్తే జనం రావొచ్చు కానీ, ఎన్నికల టైమ్ లో ఓట్లు రాలుతాయనే గ్యారెంటీ లేదు.
ఇది వైఎస్ జగన్ అంటే.. పొదిలిలో ఇసుకేస్తే రాలనంత జనం
-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 🔥 pic.twitter.com/l3eONvypje
— Rahul (@2024YCP) June 11, 2025
2029 నాటికి ఏం జరుగుతుంది..?
జగన్ ఆశంతా 2029లో అధికారం చేజిక్కించుకోవాలనే. ఐదేళ్లు అధికారం ఇస్తే మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు వంటి కీలక హామీల గురించి అసలు మాట్లాడకుండానే కాలం గడిపారు జగన్. మూడు రాజధానుల పేరుతో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. మరి 2029 ఎన్నికల ప్రచారంలో ఆయన ఏమేం హామీలు ఇస్తారు. ఈసారయినా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పగలరా..? తాను అధికారంలోకి వస్తే అమరావతిని పక్కనపెట్టి వైజాగ్, కర్నూలుని అభివృద్ధి చేస్తానని అనగలరా..? పోనీ చంద్రబాబు ఇస్తున్న తల్లికి వందనాన్ని మరింత పెంచి ఇస్తానంటారా..? అన్నీ చంద్రబాబు చేసేస్తే, ఇక జగన్ కొత్తగా చేయడానికి ఏముంటుంది..? మరి ఎన్నికలనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
అతి విశ్వాసం వద్దు..
ఒకసారి వైనాట్ 175న అంటూ వైసీపీ నేతలు బొక్కబోర్లా పడ్డారు. మరోసారి జగన్ ని చూసి జనం వచ్చేస్తున్నారని సంబరపడటం కరెక్ట్ కాదేమోననే వాదన వినపడుతోంది. వచ్చిన జనం అంతా జగన్ ని సీఎం సీఎం అంటుంటే ఆయన మురిసిపోవచ్చేమో కానీ, ఈ జనంలో సగం మంది ఓట్లు వేసినా జగన్ పార్టీ నేతలు గెలిచి ఉంటారనే విషయం అందరికీ తెలుసు. పోలింగ్ బూత్ లలో ఓట్లు వేయని జనం రోడ్లపైకి వచ్చి జై జగన్ అనే నినాదాలు చేస్తే దానికి చంకలు గుద్దుకోవడం అంత తెలివైన పని కాదేమో. ఈసారి కూడా ఇలాంటి నినాదాలతోనే సంబరపడితే వైసీపీ అధికారంలోకి రావడం కష్టం. ఊహాలోకం నుంచి ఎంత త్వరగా వాస్తవంలోకి వస్తే అంత మంచిది. బెంగళూరు నుంచి మకాం త్వరగా విజయవాడకు మారిస్తే మరీ మంచిది.