Sailajanath: ఎన్డీయే కూటమి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. ఎన్డీయే ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి ఆగడాలను ఎదుర్కొనేందుకు వైసీపీలో చేరానని తెలిపారు. వైసీపీలో చేరిన తరువాత తొలిసారి అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చారాయన.
వైయస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబమన్నా తనకు ఆరాధన భావం ఉందన్నారు శైలజనాథ్. అధినేత జగన్-చెల్లెలు షర్మిల మధ్య జరుగుతున్న వివాదం త్వరలో ముగిసిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం , శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలన్నారు. యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా డిప్యూటీ సీఎం ఏపీలో ఉండి ప్రజల పక్షాన నిలబడాలని సూచన చేశారు మాజీ మంత్రి. సూపర్ సిక్స్ హామీలను చూసి మీకు ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. హామీలు ఇచ్చేటప్పుడు అమలు చేయలేమని సీఎం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ఇవ్వడానికి ముఖ్యమంత్రి మనసుకు కష్టంగా ఉంటుందని తనకు అనిపిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో క్షమాపణలు చెబితే సరిపోదని, శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు జరుగుతుందన్నారు. శైలజానాథ్‌ని ఆహ్వానించారు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి,ఆలూరు సాంబశివారెడ్డి. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులకు వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.