Champions Trophy: మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ కళ తప్పింది. ఈ మెగా టోర్నిని గాయాల బెడద వెంటాడుతుంది. పలువురు స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడి ఈ టోర్నీకి దూరం కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కేవలం గాయాల కారణంగా మాత్రమే కాకుండా వివిధ కారణాలవల్ల స్టార్ ఆటగాళ్లు, సీనియర్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కాబోతున్నారు. ఇలా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమైన ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం..
Also Read: Matthew Kuhnemann: బౌలింగ్ యాక్షన్ లో అనుమానాలు.. ఆస్ట్రేలియన్ బౌలర్ మాథ్యూపై నిషేధం !
ఈ గాయాల కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన వారిలో ఎక్కువగా ఆస్ట్రేలియా జట్టు సభ్యులే ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలవల్ల ఛాంపియన్ ట్రోఫీకి దూరంగా ఉండబోతున్నట్లు ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ప్రకటించాడు. ఇప్పటికే మిచల్ మార్ష్ గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. ఇక ఆ జట్టు కెప్టెన్ పాట్ కమీన్స్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
దీంతో అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు మార్కస్ స్టోయినీస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ జట్టు పేస్ బౌలర్ జోష్ హెజిల్ వుడ్ కూడా గాయం కారణంగా ఈ మెగా టోర్నికి అందుబాటులో ఉండడం లేదు. అలాగే మరో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా గాయంతో చాలా రోజులుగా క్రికెట్ కి దూరంగా ఉంటున్నాడు. తాజాగా పాకిస్తాన్ తో జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర తలకు బంతి తగిలి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అతడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం కష్టమేనన్న మాటలు వినిపిస్తున్నాయి. మరో పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం అనుమానమే. ఇక సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ అన్రిచ్ నోకియా వెన్నునొప్పి కారణంగా ఈ టోర్నీ నుండి వైదొలిగాడు. ఇక పాకిస్తాన్ యువ సంచలనం నయీమ్ ఆయుబ్ చీలమండల గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అలాగే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జాకబ్ బెథెల్ తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు.
ఇతను కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం అనుమానమే. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో సెలక్షన్ కమిటీ హర్షిత్ రానని జట్టులోకి తీసుకుంది. ఇలా చాలామంది స్టార్ ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. ఇలా ఈ ప్రమాదకరమైన బౌలర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడమే కాకుండా.. మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కి కూడా దూరం కానున్నట్లు సమాచారం. దీంతో ఈ ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీల ఓనర్లు, క్రీడాభిమానులలో టెన్షన్ నెలకొంది.