YSRCP: వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లిలో పర్యటన కేసులో 113 మందికి విచారణకు రావాలని.. పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత నెల సత్తెనపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. నిబంధనలకు వ్యతిరేకంగా బలప్రదర్శన చేసి, ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సత్తెనపల్లి వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డిని.. ఆదివారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.
సుధీర్ భార్గవ్ రెడ్డితో పాటు మరికొందరికి కూడా నోటీసులు పంపినట్టు సమాచారం. బలప్రదర్శనకు ముందు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అవి పాటించకపోవడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వైసీపీ శ్రేణులు మాత్రం ఈ కేసును రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలతో కలిసే హక్కు ఉండదా? అనే ప్రశ్నలు వేస్తున్నారు. పూర్తిగా నిబంధనల మేరకు సభలు జరిగాయి. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. ఇది అధికార దుర్వినియోగమే అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
వైఎస్ జగన్ సెక్యూరిటీపై ఏపీలో పొలిటికల్ రచ్చ నడుస్తోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం జగన్‌కు.. కూటమి ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు జడ్-ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ.. జగన్ పర్యటనల్లో కనీస భద్రత లేదని చెబుతున్నారు. జగన్‌కు భద్రత కల్పించకుండా, ఆయన పర్యటనల్లో ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టించి, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైసీపీ నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. సత్తెనపల్లిలో జరిగిన ఘటనలో.. జగన్ కారు వల్ల ప్రమాదం జరగలేదని పోలీసులు మొదట చెప్పారని.. తర్వాత జగన్ కాన్వాయ్‌పైనే కేసు పెట్టారని ఘాటు విమర్శలు చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారిపై కూడా కేసులు పెట్టడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే.. తమ నేతలపై కేసులు బనాయిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. భయపెట్టాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
Also Read: రొట్టెల పండుగ ప్రారంభం.. మీ కోరిక తీరాలంటే అక్కడికి వెళ్లండి?
మరోవైపు.. సింగయ్య మృతి ఘటనలో జగన్ కారు ప్రమేయం ఉన్నట్లుగా స్పష్టమైన ఆధారాలున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషాదకర ఘటనని.. రాజకీయం చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడంట లేదని.. అదే జరిగితే.. వైసీపీ నేతలెవరూ బయట తిరిగేవారు కాదని.. తెలుగుదేశం మంత్రులు, నాయకులు కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా.. జగన్ భద్రతకు సంబంధించి.. రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. వైసీపీ దీనిని ప్రభుత్వ కుట్రగా, కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తుంటే.. తెలుగుదేశం మాత్రం జగన్, వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఎదురుదాడి చేస్తోంది.