YSRCP: ఏపీలో వైసీపీ నేతల రౌడీయిజానికి అంతు ఉండటం లేదు. అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం రాంపల్లెలో సొంత సోదరుడి భార్యపైనే వైసీపీ నాయకుడు రఘునాథరెడ్డి విచక్షణారహితంగా దాడి చేశారు. జుట్టు పట్టి లాగి, కాళ్లతో తన్ని పిడిగుద్దులతో దాడి చేశారు.
రాంపల్లెకు చెందిన పార్వతమ్మ, ఉసేన్‌రెడ్డి దంపతులకు వైసీపీ నేత రఘునాథరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే వీరికి ఉన్న వ్యవసాయ భూమిని సంతానానికి పంచకుండానే పార్వతమ్మ మృతి చెందారు. దీంతో ఆమె పేరుపై ఉన్న 20 ఎకరాల పొలం కోసం కొంతకాలంగా గొడవ జరుగుతోంది.
ఈ పొలంపై రఘునాథరెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి భార్య ప్రభావతమ్మ కోర్టులో కేసు వేశారు. కానీ కేసు విషయం పట్టించుకోకుండా 20 ఎకరాల భూమిని తన ఆధీనంలో తెచ్చుకోవాలని రఘునాథరెడ్డి భావించారు. నలుగురు అక్కాచెల్లెల్లకు వచ్చే వాటా పొలాన్ని కౌలుకు తీసుకుంటానని చెప్పి మిగిలిన వారిని ప్రభావతమ్మ ఒప్పించారు. ఈ క్రమంలో పొలం సాగు చేసుకునేందుకు ప్రభావతమ్మ అక్కడికి వెళ్లారు.
విషయం తెలుసుకున్న రఘునాథరెడ్డి అక్కడకు చేరుకుని ఆమెను తిడుతూ విచక్షణారహితంగా కొట్టారు. మహిళని కుడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రభావతమ్మ స్పృహ కోల్పోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రఘునాథరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.