Dementia Patients: మనుషుల్లో మతిమరుపు అనేది సహజం. పెద్ద పెద్ద విషయాలను మరచిపోకుండా గుర్తుపెట్టుకునేవారు కూడా చిన్న చిన్న విషయాలను మర్చిపోతుంటారు. మామూలుగా ఫోన్ ఎక్కడ పెట్టాము, కళ్లద్దాలు ఎక్కడ పెట్టాము అని రోజూ వెతుక్కునేవారు చాలామందే ఉంటారు. అలాంటి వారికి సాయంగా కొన్ని టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మరికొంత అడ్వాన్స్‌గా ఆలోచించి శాస్త్రవేత్తలు.. ఇలాంటి విషయాల్లో మనుషులకు సాయం చేయడానికి రోబోలను రంగంలోకి దింపారు.
ఇప్పటికే రోబోలు అనేవి చాలా రంగాల్లో మనుషులకు సహాయపడుతూ ఉన్నాయి. అలాగే ఇంటి పనుల్లో సాయం చేయడానికి కూడా రోబోలను సాయంగా పెట్టుకుంటున్నారు చాలామంది. అలాగే మనుషులు మర్చిపోయిన వస్తువులను వెతికిపెట్టడానికి, వారు మర్చిపోయిన విషయాలను గుర్తుచేయడానికి ఆర్టిఫిషియల్ మెమోరీతో తయారు చేసిన ఒక రోబో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా డిమెన్షియా ఉన్న పేషెంట్లకు ఈ రోబోలు సాయం చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇప్పటికే చాలామంది రోబోలు మనుషులతో స్నేహం చేస్తున్నాయి. అయితే పర్సనలైజ్డ్ రోబోలు మనుషులకు మరికొంత స్వేచ్ఛను ఇస్తాయి. అందుకే చాలామంది అలాంటి ఒక రోబో ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటారు. డిమెన్షియా అనేది వయసు పెరుగుతున్నవారిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ఇది బ్రెయిన్ ఫంక్షన్‌ను ఆపేస్తుంది, మనిషిని అయోమయంలో పడేస్తుంది, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. ఇన్ని సమస్యలకు కారణమవుతున్న డిమెన్షియాకు ఇప్పటివరకు సరైన చికిత్స లేదు.
డిమెన్షియా వల్ల రోజూవారి జీవితంలో కూడా పేషెంట్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూ ఉంటారు. వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతుంటారు. అలాంటి వారికి సాయంగా, స్నేహంగా ఒక తోడు ఉంటే బాగుంటుందని శాస్త్రవేత్తలు భావించారు. అందుకే ఇలాంటి కొత్త రకమైన రోబోలను తయారు చేశారు. ఇలాంటి రోబోలు టెక్నాలజీ రంగంలో గేమ్ ఛేంజర్స్‌గా మారనున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. వారు అనుకున్నట్టుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆర్టిఫిషియల్ మెమోరీను సృష్టించడంలో వారు సక్సెస్ అయ్యారు.
ముందుగా చిన్నగా మొదలయిన ఈ రోబో తయారీ ప్రయత్నం.. తర్వాత సక్సెస్‌ఫుల్‌గా శాస్త్రవేత్తలు అనుకున్న గమ్యానికి చేర్చింది. ఒక కనిపించని వస్తువును కనిపెట్టడం కోసం ముందుగా ఆ వస్తువును చివరిసారిగా ఎక్కడ, ఎప్పుడు చూశాం అనే విషయాలను రికార్డ్ చేసుకొని గుర్తుచేసుకుంటుంది. ఇప్పటికే ఇంట్లో ఉపయోగించే పలు ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌ను ట్రాక్ చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్‌లోని యాప్‌లో లేదా కంప్యూటర్‌లో ఈ ట్రాకింగ్ టెక్నాలజీని పెట్టుకొని కనిపించని వస్తువులను వెతకడం మొదలుపెట్టారు. కానీ దానికంటే ఈ రోబో మరింత మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.