పవన్ కల్యాణ్ పై కేసు పెట్టాలంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు వైసీపీ నేతలు. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వారినుంచి కంప్లయింట్ తీసుకుని పంపించేశారు. ఇక ఆ తర్వాత వైసీపీ అనుకూల మీడియాలో హడావిడి మొదలైంది. పవన్ పై కేసు పెట్టాల్సిందేనంటూ వరుస కథనాలు ప్రసారమయ్యాయి. అసలింతకీ పవన్ చేసిన తప్పేంటి? ఆయనపై ఎందుకు కేసు పెట్టాలి?
తిట్టండి.. కొట్టండి అంటూ యువతని @PawanKalyan .అతనిపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైయస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు pic.twitter.com/H5WIRD9ilh
— YSR Congress Party (@YSRCParty) July 26, 2025
పెడర్థాలు..
హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా వరుస మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు పవన్. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. అయితే ఆ వ్యాఖ్యలకు వారు పెడర్థాలు తీస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ ఉద్దేశం వేరని, వైసీపీ రాజకీయ దురుద్దేశం వేరని అంటున్నారు.
పవన్ ఏమన్నారు?
హరిహర వీరమల్లుపై జరుగుతున్న నెగిటివ్ ట్రోలింగ్ గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి కామెంట్లకు అభిమానులు నలిగిపోవద్దని చెప్పారు. దాని బదులు వారికి అదే రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. నెగెటివ్ ట్రోలింగ్ కి అదేరీతిలో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే తిరిగి కొట్టండి, ఎలా దాడి చేయాలో అలా చేయండి అన్నారు. అయితే ఇక్కడ పవన్ తిరిగి కొట్టడం, దాడి చేయడం అనేవి కేవలం సోషల్ మీడియాలోనే అనేది గుర్తించాల్సి ఉంది. సోషల్ మీడియా ట్రోలింగ్ లను సోషల్ మీడియాలోనే తిప్పి కొట్టాలన్నారు పవన్ కల్యాణ్. అయితే ఆయన వ్యాఖ్యలను వక్రీకరించిన వైసీపీ నేతలు భౌతిక దాడులకు పవన్ ప్రోత్సహించారంటూ పెడర్థాలు తీస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు.
ఇట్ ఈజ్ ఎబౌట్ అవర్ సివిలైజేషన్, ఇది భారతీయత అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సినిమాకు సంబంధించినవి. ఈ సినిమా మన భారతీయతకు సంబంధించినది అని పవన్ ప్రసంగించారు. అయితే దాడులు చేయాలని ప్రోత్సహించి, అలా దాడులు చేయడం మన సివిలైజేషన్ అన్నట్టుగా పవన్ మాట్లాడారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం విశేషం. ఈ ఫిర్యాదు వార్తలపై జనసైనికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ నాయకుడి సినిమాపై తప్పుడు ప్రచారం చేసింది చాలక, ఇప్పుడు కేసులంటూ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ శ్రేణుల తప్పుడు ప్రచారాన్ని దాటుకుని మరీ హరిహర వీరమల్లు సక్సెస్ అయిందని చెబుతున్నారు. ఒకరకంగా వైసీపీ వ్యతిరేక ప్రచారమే ఈ సినిమాకి మరింత ప్లస్ అయిందనే వాదన కూడా వినపడుతోంది.
రప్పా రప్పా సంగతేంటి?
నెగెటివ్ ట్రోలింగ్ ని ఎదుర్కోండి అని పవన్ చేసిన వ్యాఖ్యలపై కేసులు పెట్టాల్సి వస్తే, మరి చీకట్లో రప్పా రప్పా చేసేయండంటూ కార్యకర్తలకు ఉద్బోధ చేసిన పేర్ని నానిని ఏంచేయాలో వైసీపీ నేతలే చెప్పాలి. రప్పా రప్పా వ్యాఖ్యలు పెద్ద తప్పేం కాదని చెప్పుకుంటూ పేర్ని నాని బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వైసీపీ నేతలు ఆయనకి మద్దతుగా మాట్లాడుతున్నారు, ఆ కేసు రాజకీయ కక్షసాధింపు అంటున్నారు. మరి పవన్ పై కేసు పెట్టాలంటూ వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుని ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు జనసైనికులు.