జగన్ రాయలసీమ పర్యటనకు జనం బాగానే వచ్చారు, వస్తారు కూడా. ఆ మాటకొస్తే 2024 ఎన్నికల ప్రచారంలో ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు కూడా జనం విరగబడి వచ్చారు. కానీ వారిలో ఓట్లు వేసింది ఎందరు..? కనీసం జగన్ కి ప్రతిపక్ష నేత హోదా కూడా ఎందుకు రాలేదు..? ఇవన్నీ అంచనా వేయకుండా ఈరోజు రాయలసీమలో జగన్ కోసం జనం తరలి వచ్చారంటూ ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. హెలిప్యాడ్ వద్దకే వేలమంది తరలి వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదిర్తి ప్రకాష్ రెడ్డి ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ కి వైసీపీ నేతలు సంబరపడుతూ కామెంట్లు పెట్టినా, సామాన్య జనం మాత్రం ఇకనైనా ఈ ఎలివేషన్లు ఆపండయ్యా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
సినిమా సీన్ అనుకున్నారా..కాదు , జగనన్న ఎంట్రీ అది! 🔥😎#TDPAntiBC #ThopudurthiPrakashReddy #JaganannaConnects #boycottparitalapolitics #TeamTPR #YSJaganInRaptadu#TheAndhraVoice pic.twitter.com/cTuHrugIGd
— Thopudurthi Prakash Reddy (@ImThopudurthi) April 8, 2025
జగన్ క్రౌడ్ పుల్లర్..
అభిమానం వేరు, రాజకీయాలు వేరు. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఆయన పర్యటనలకు జనం విరగబడి వచ్చేవారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం ఖాయం అని అనుకున్నారంతా. చిరంజీవికి జనం మద్దతిచ్చినా, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం మాత్రం ఇవ్వలేదు. అంతెందుకు పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చారంటే ఎంత హడావిడి ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆయన చుట్టూ జనం, ఆయన్ను దూరం నుంచి చూసేందుకు, ఆయనతో సెల్ఫీ దిగేందుకు, కనీసం ఆయన దృష్టిలో పడాలనే తపనతో ఎంతోమంది యువత రోడ్లపైకి వచ్చేవారు. కానీ పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ఎన్ని సంవత్సరాలు వేచి చూశారో మనందరికీ తెలుసు. జగన్ కి కూడా అంతే, జనం విరగబడి వస్తారు. 2014లోనూ వచ్చారు, 2019, 2024 ఎన్నికల ప్రచారంలో కూడా వచ్చారు. కానీ జగన్ కేవలం 2019లో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. 2024 ప్రచారంలో ఎక్కడలేని హడావిడి జరిగినా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
హెలిప్యాడ్ వద్దనే వేల మంది ఉన్నారు..🔥🔥#JaganannaConnects #ThopudurthiPrakashReddy #TeamTPR #boycottparitalapolitics pic.twitter.com/GVVm9bzWQw
— Thopudurthi Prakash Reddy (@ImThopudurthi) April 8, 2025
ఫలితాలపై నమ్మకం లేదు..
వైసీపీకి 11 సీట్లు రావడమేంటి..? ఎక్కడో ఏదో మోసం జరిగిందని ఆ పార్టీ నేతలు నిన్న మొన్నటి వరకు రిజల్ట్ ని అస్సలు నమ్మలేదు. అప్పుడప్పుడు అంబటి రాంబాబు వంటి వారు మాత్రం తమని ప్రజలు దూరం పెట్టారనే విషయాన్ని ఒప్పుకున్నారు. కానీ ఎక్కువమంది ఈవీఎంలను నిందించారు, ప్రజలు చంద్రబాబు హామీలకు పడిపోయారనుకున్నారు. రీసెంట్ గా జగన్, జనంలోకి వస్తున్నప్పుడు కూడా ఆదరణ బాగానే ఉంది. జగన్ కోసం జనం గుమికూడే వీడియోలే దీనికి సాక్ష్యం. కానీ వైసీపీ అంతకు మించి ఆశించడమే ఇక్కడొచ్చిన ఇబ్బంది. గతంలో ఓ చిన్నపాప జగన్ వద్దకు వచ్చి.. అమ్మఒడి రావడం లేదన్నా అంటూ ఆవేదన వ్యక్తం చేయడం, ఆ పాపను జగన్ దగ్గరకు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీన్ కట్ చేస్తే అది పీఆర్ స్టంట్ అంటూ నెటిజన్లు తీర్మానించారు. ఆర్థికంగా స్థితిమంతులైన ఆ కుటుంబానికి అమ్మఒడి ఎందుకంటూ సామాన్యులు సైతం ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలతో వైసీపీ జనంలో మరింత పలుచన అవుతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రౌండ్ రియాల్టీ..
జగన్ కి జనంలో ఆదరణ ఉందనడాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఆ పార్టీని జనం 11 సీట్లకే పరిమితం చేశారనే వాస్తవాన్ని కూడా నేతలు అర్థం చేసుకోవాలని నెటిజన్లు అంటున్నారు. గతంలో చేసిన తప్పొప్పులను బేరీజు వేసుకుని రాబోయే రోజుల్లో ప్రజలపక్షాన నిలబడాలని ఆశిస్తున్నారు. అలాంటివేవీ లేకుండా కేవలం జనం వస్తున్నారు, కాబోయే సీఎం జగనే అని వైసీపీ నేతలు అత్యుత్సాహం చూపించడం సరికాదని సలహా ఇస్తున్నారు. ఇకనైనా ప్రచారానికి ప్రాధాన్యం తగ్గించి, ప్రజల్లోకి వెళ్లడంపై దృష్టి పెట్టాలని అంటున్నారు.