2014 నుంచి 2019 వరకు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. కొన్నాళ్లు కూటమి, ఆ తర్వాత టీడీపీ ఒంటరిగా ప్రభుత్వంలో ఉంది. అప్పట్లో వైసీపీ నుంచి ఈ స్థాయిలో ఘర్షణ లేదు. 2024లో తిరిగి కూటమి అధికారంలోకి వచ్చింది. ఏడాదిలో ఎంత రచ్చ జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. తప్పు చేసిన నేతలంతా క్యూలైన్లో జైలుబాట పట్టారు. రెడ్ బుక్ అంటూ వైసీపీ నేతలు కలలో కూడా కలవరిస్తున్నారు. మిగిలిన వారిని కూడా జైలు భయం వెంటాడుతోంది. మరి అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి..? అప్పుడు ప్రతిపక్షంలో ఉండి రిలాక్స్ గా ఉన్న వైసీపీ ఇప్పుడెందుకు కలవరపడుతోంది. కారణం ఒక్కరే. నారా లోకేష్.
లోకేష్ జపం చేస్తున్న వైసీపీ..
వైసీపీలో చాలామంది నేతలు ఇప్పుడు చంద్రబాబు కంటే ఎక్కువగా లోకేష్ జపం చేస్తున్నారు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ తమను ఇబ్బంది పెడుతున్నారంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టే వైసీపీ నేతలు కూడా ఎక్కువగా లోకేష్ ని ట్యాగ్ చేస్తున్నారు. అంటే సీఎం చంద్రబాబు కంటే, మంత్రి లోకేష్ తోనే వారు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారనమాట. ఇక్కడ అందరికీ మిర్చి సినిమాలో ప్రభాస్ డైలాగ్ గుర్తురాక మానదు. ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఇప్పటి ఏపీ రాజకీయాలను గుర్తు తెస్తుంది.
వైసీపీ నేతలు రెడ్ బుక్ అంటూ రచ్చ చేస్తున్నా అక్రమంగా కేసులు పెడితే కోర్టులు చూస్తూ ఊరుకోవు కదా. తప్పులు చేశారు కాబట్టే, సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టే వైసీపీ నేతలు ఒక్కొక్కరే జైలుకి వెళ్తున్నారు. బెయిల్ కూడా తెచ్చుకోలేని రేంజ్ లో వారు తప్పులు చేశారు కాబట్టే, బయటపడలేకపోతున్నారు. ఇన్నాళ్లూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తప్పులు చేసినవారంతా, కూటమి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లాలనుకున్నారు. కానీ లోకేష్ యాక్టివ్ కావడంతో వారంతా భయపడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు వైసీపీ నేతలు తప్పులు చేసినా అప్పట్లో చంద్రబాబు పూర్తిగా లైట్ తీసుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ మాత్రం తప్పు చేసిన వారిని క్షమించట్లేదని, అందుకే వైసీపీ నేతలకు వణుకుపుడుతోందని సెటైర్లు పేలుస్తున్నారు.
పార్టీ పరంగా టీడీపీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్నారు లోకేష్. ఎక్కడ కార్యకర్తకు ఏ నష్టం వచ్చినా ఆయన నేరుగా రంగంలోగి దిగుతున్నారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ తన టీమ్ తో అప్ డేట్స్ తెప్పించుకుంటున్నారు. లోకేష్ స్పందించే తీరుతో టీడీపీ కార్యకర్తలు సంతోషపడుతున్నారు, అదే సమయంలో వైసీపీ కార్యకర్తల్లో తమ పార్టీపై కోపం పెరుగుతోంది. ఈ విషయంలో కూడా వైసీపీ నేతలకు లోకేష్ తలనొప్పిగా మారారు.
శాఖాపరంగా లోకేష్ తీసుకుంటున్న చర్యలు జగన్ పాలనలోని లోపాల్ని ఎత్తిచూపుతున్నాయి, అదే సమయంలో కూటమి పాలనలో మార్పు కూడా చూపెట్టగలుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అమ్మఒడి గ్రేట్ అనుకున్నారు, కానీ తల్లికి వందనంతో పాత పథకం పేరు కూడా మరచిపోయేలా చేశారు లోకేష్. ఆ స్థాయిలో తల్లికి వందనం సక్సెస్ చేశారని టీడీపీ నేతలంటున్నారు. నాడు-నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశామని వైసీపీ చెప్పుకుంటున్నా.. ఆ పనుల్లో డొల్లతనాన్ని కూటమి బట్టబయలు చేసింది. అసలు అభివృద్ధి అంటే ఏంటో స్టెప్ బై స్టెప్ చూపిస్తోంది. సో, కూటమి పాలన గతంలో వేరు, ఇప్పుడు వేరు అన్నట్టుగా ఉంది. ఆ మార్పు ప్రజలకు సంతోషాన్నిస్తుంటే, వైసీపీకి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా లోకేష్ పేరు చెబితేనే మాజీ మంత్రుల్లో కలవరపాటు మొదలవుతోంది.