YCP Press Meet : మేమంటే మీకు భయం. మా ప్రశ్నల్ని తట్టుకోలేరని మీకు తెలుసు. ప్రజా సమస్యలపై మిమ్మల్ని నిలదీస్తామనే మాపై కక్ష కట్టారు. ఇవీ వైసీపీ నాయకుల మాటలు. ఓ వైపు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే.. బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే.. వాటికి హాజరుకానీ వైసీపీ నాయకులు మీడిమా సమావేశం పెట్టారు. జగన్ ఇటీవల ప్రకటించినట్లుగానే.. చట్టసభలో ప్రభుత్వం మాట్లాడుతుంటే.. వాటిపై మీడియా సమావేశాల ద్వారా ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యేలు.
మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్… కీలకమైన బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షాలను పిలవాలని, కానీ అధికార పక్షం మాత్రం తమని విస్మరించిదని ఆరోపించారు. పైగా.. తమపైనే తిరిగి విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకులు అసెంబ్లీలో ఉంటే అధికార పక్ష నాయకులకు భయమన్న నేతలు.. ఈ ఆరు నెలల కాలంలోని తప్పుల్ని, అరాచకాల్ని, ఆర్థిక దోపిడీలను వివరిస్తామని భయపడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు హామీలను ప్రకటించి.. వాటిని మర్చిపోయారని, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు.
కూటమి ప్రభుత్వం దొరికిపోయింది..
రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా.. కూటమి పార్టీలు చెప్పిన అబద్ధాలు బయటపడ్డాయన్న వైసీపీ నాయకులు.. ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్ర అప్పుల్ని రూ.14 లక్షల కోట్లని చెప్పారని అన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం రాష్ట్ర అప్పుల్ని చెప్పిన దాంట్లో సగం కూడా చూపించలేదని ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాము ముందు నుంచే చెబుతున్నామని అన్నారు.
హామీ ఇస్తే అసెంబ్లీకి వస్తాం..
అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ రాకపోవడానికి కారణం మీరే అంటూ విమర్శించిన వైసీపీ నాయకులు.. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదా అని ప్రశ్నించారు. అలా ఇవ్వకూడదని ఎక్కడ ఉందో చూపించాలని సవాళు విసిరారు. వైసీపీ అసెంబ్లీకి వస్తే అంత భయమెందుకన్న వైసీపీ ఎమ్మెల్యేలు.. 11 మందిని ఎదుర్కొనే ధైర్యం లేదా.?అని ప్రశ్నించారు. తాము అసెంబ్లీకి వస్తే అందరితో పాటే మైకు ఇస్తామంటే ఎలా అని అడిగిన వైసీపీ నేతలు.. తగినంత సమయం ఇస్తామని స్పీకర్ తో చెప్పించాలని, అలా చెబితే అసెంబ్లీకి వస్తామని ప్రకటించారు.
ప్రభుత్వంలోని అందరినీ తమ ఏజెంట్లుగా మార్చుకున్నారని.. ప్రభుత్వాన్ని విమర్శించిన వైసీపీ. ఈ ఆరు నెలల కాలంలోనే రూ.7 వేల కోట్లు అప్పులు చేశారని, వాటిని ఎందుకు ఖర్చు చేశారో తెలపాలన్నారు. రాష్ట్ర నిధుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించిన వైసీపీ నాయకులు.. ఏడాది సమయానికి ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి. కానీ.. ఎన్నాళ్లకు పెడుతున్నారు. ఆరు హామీలకు సరిపడా నిధులు విడుదల చేయకుండా… చాలా స్పల్పంగా బడ్జెట్ పెట్టారు. హామీలను తప్పించుకునేందుకే.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Also Read : కేశవ్ బడ్జెట్‌లో ఆ రెండు రంగాలకే అగ్రతాంబూలం
మేము వచ్చి, మీ నిర్ణయాలు, తప్పులపై పోరాడేందుకు సిద్ధం. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే.. అసెంబ్లీకి వస్తాం. ప్రతిపక్ష పార్టీని గుర్తిస్తే.. వారికి మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రశ్నించేవారిపై దాడులు చేస్తున్నారన్న వైసీపీ నేతులు. ఎవరు ప్రశ్నిస్తే.. వారిపై కేసులు పెడుతున్నారని, అధికార పక్ష నాయకుల అక్రమాలకు అడ్డుపడుతున్న ఎస్పీలు, ఐఎఎస్ లపై దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బయట మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నారు.. ఇక అసెంబ్లీలో తప్పుల్ని ఎత్తిచూపితే తట్టుకోలేరని మీకు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రతీ రోజు.. అసెంబ్లీ సమావేశాల్లోని ప్రతీ తప్పుడు నిర్ణయాల్ని బయటి నుంచి ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము రావాలని మీకు ఉంటే.. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.