సూపర్ సిక్స్ హామీల్లో మరొక కీలక హామీ ఈరోజు అమలులోకి వచ్చింది. స్త్రీశక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏ పథకాన్ని అమలులోకి తెస్తున్నా, ప్రతిపక్ష వైసీపీ రచ్చ చేయడం సహజమే. అయితే ఈరోజు మాత్రం ఆ పథకం పేరెత్తడానికి కూడా వైసీప నేతలు సాహసం చేయడం లేదు. ఇంకా పులివెందుల ఉప ఎన్నికల ఫలితంపైనే వారు స్పందిస్తుండటం విశేషం. ఓవైపు సూపర్ సిక్స్, సూపర్ హిట్ అంటూ చంద్రబాబు చెబుతున్నా వైసీపీ నుంచి మాత్రం నో కామెంట్.
భారీగా లబ్ధిదారులు..
ఏపీలో ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు వేరు, ఇప్పుడు అమలులోకి వచ్చిన స్త్రీశక్తి వేరు. రాష్ట్ర జనాభాలో దాదాపు సగభాగం ఉన్న మహిళలు అందరికీ వర్తించే పథకం ఇది. కుల, మత, పేద, ధనిక, భేదాలు లేకుండా అందరికీ వర్తించే పథకం ఇది. అందుకే ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య మిగతా పథకాలకంటే చాలా ఎక్కువ. ఇలాంటి పథకాన్ని విమర్శించాలంటే లోటుపాట్లు తెలిసి ఉండాలి. కానీ ఇక్కడ వైసీపీకి ఆ అవకాశం లేదు, ఎందుకంటే పగడ్బందీగా ఈ పథకానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
విమర్శలు-నవ్వులపాలు
ఆమధ్య తల్లికి వందనం పథకం విషయంలో కూడా విమర్శలు చేసి వైసీపీ నవ్వులపాలైంది. ఇంట్లో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుందంటూ వైసీపీ విమర్శించినా, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ ఈ పథకం ఫలాలు అందాయి. దీంతో వైసీపీ విమర్శలకు బ్రేక్ పడింది. ఇప్పుడు స్త్రీశక్తి విషయంలో కూడా వైసీపీ ముందుగా విమర్శలు చేసి నవ్వులపాలైంది. ఈ పథకాన్ని కేవలం జిల్లాకే పరిమితం చేస్తున్నారని అన్నారు వైసీపీ నేతలు. ఈ విమర్శలకు కావాలనే టీడీపీ స్పందించలేదు. తీరా పథకం అమలు దశకు వచ్చాక, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ వైసీపీ చేసిన నెగెటివ్ ప్రచారం, ఈ పథకానికి ప్లస్ అయిందనే చెప్పాలి. అందుకే ఇప్పుడు వైసీపీ పూర్తిగా సైలెంట్ అయింది.
సూపర్ సిక్స్ హామీల్లో స్త్రీ శక్తి పథకం చాలా ముఖ్యమైనది. మహిళలకు ఇది ఆర్థికంగా ఆసరాగా నిలుస్తుంది. ఉద్యోగులు, ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, ముఖ్యమైన పనులకోసం దూరప్రాంతాలకు వెళ్లేవారు.. ఇలా అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఈపథకంపై విమర్శలు చేయడమంటే సాహసమే చెప్పాలి. ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే ఈ పథకం అమలవుతుంది. ఇలాంటి పథకం అమలవుతున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవే కండిషన్లు ఉన్నాయి. వాస్తవానికి ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ సర్వీసులే ఆర్టీసీలో అధిక శాతం ఉంటాయి. ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే చాలు. అన్ని బస్సుల్లో ఉచితం అంటే కచ్చితంగా అది ఆర్టీసీని ఇబ్బందుల్లో నెడుతుంది. అందుకే మహిళలకు ఉపయోగంగా ఉండేలా, ఆర్టీసీకి నష్టం లేకుండా ప్రభుత్వం నిబంధనలు రూపొందించడం విశేషం. ఈ పథకం విషయంలో లోటుపాట్లు ఉంటే భవిష్యత్తులో విమర్శలు చేయొచ్చు కానీ, ఇప్పుడే తొందరపడితే వైసీపీకే నష్టం. అందుకే ఆ పార్టీ నేతలు వేచి చూస్తున్నారు.