Telangana politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకి వంద శాతం సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఐదు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో తొలివిడత నామినేషన్లు అక్టోబరు 9 నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అలర్టయ్యారు. మంగళవారం సాయంత్రం టీపీసీసీ చీఫ్, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, డిప్యూటీసీఎం, పలువురు మంత్రులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి.
జామ్ ద్వారా నేతలతో మాట్లాడారు ముఖ్యమంత్రి. జడ్పీటీసీ సీట్లకు అభ్యర్థుల పేర్లను అక్టోబరు 5 నాటికి పీసీసీకి పంపాలని మంత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ముఖ్య నాయకులతో సంప్రదించాలన్నారు. జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన అభ్యర్థులను గుర్తించాలన్నారు.
గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను ఆరు లేదా ఏడు నాటికి పీసీసీ ఎంపిక చేస్తుందన్నారు. అభ్యర్థుల ఎంపికలో చిన్న పొరపాటు కూడా చేయవద్దన్నారు. గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇకపై నేతలంతా ప్రచారంపై దృష్టి సారించాలని వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ఏకాభిప్రాయంతో జరగాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్. ఈ విషయంలో ఎక్కడైనా భిన్నాభిప్రాయాలు తలెత్తితే తుది నిర్ణయం పీసీసీ తీసుకుంటుందన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, గెలుపు వరకు అందరూ కలిసి పని చేయాలన్నారు.
ALSO READ: తెలంగాణలో ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి
ఎంపీటీసీ సీట్లకు జిల్లా నేతలు ఆయా అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. పోటీ అధికంగా ఉంటే పీసీసీ దృష్టికి తేవాలని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఐదులోగా అభ్యర్థుల జాబితా పీసీసీ వద్దకు వస్తే.. ఏడున అభ్యర్థులను ప్రకటించనుంది. అక్టోబర్ 9 నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది.
స్థానిక సంస్థలకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఎందుకంటే నవంబర్ 11 తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. దానికి నోటిఫికేషన్ రావడం, ఎన్నికలు, ఆ తర్వాత ఫలితాలు వచ్చేసరికి డిసెంబర్ చివరికి అవుతుందని అంటున్నారు.
వచ్చే ఏడాదిలో నామినేటెడ్ పోస్టులు భర్తీ కావడం ఖాయమని వాదనలో ఇంకోవైపు వినిపిస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కూడా వాయిదా వేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నమాట.