వైసీపీ పాలనలో నవరత్నాలు ఉన్నట్టే కూటమి హయాంలో సూపర్ సిక్స్ ఉన్నాయి. చంద్రబాబు పాలనా పటిమ తెలియాలంటే సూపర్ సిక్స్ సరిపోతాయా? అంతకు మించి జనం ఆయన నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. ఆ అంచనాలను అందుకోడానికే ఆయన పీ4 పథకాన్ని తెరపైకి తెచ్చారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్ నర్ షిప్ పేరుతో పీ4 ని నిర్వరించారు. జీరో పావర్టీ పీ4 పేరుతో ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచి వారిని పేదరికం నుంచి బయటపడేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ సాయం తీసుకునేవారిని బంగారు కుటుంబాలు అంటారు, సాయం చేసేవారిని మార్గదర్శి అంటారు. తాజాగా ఈ మార్గదర్శికి సంబంధించి ఒక లోగో విడుదల చేశారు. ఐయాం మార్గదర్శి అనే పేరుతో ఒక బ్యాడ్జీని రూపొందించారు. దాతలకు వాటిని ప్రభుత్వం అందిస్తుంది.
20 లక్షల కుటుంబాలు..
ఏపీలో దాదాపు 20 లక్షల కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయి. ఎవరో ఒకరు చేయూత ఇస్తే కానీ వారు ఆ పేదరికం నుంచి బయటపడరు. ఈ కుటుంబాల్లో చదువుకునే పిల్లలున్నారు, చదువు పూర్తి చేసి ఉద్యోగాలకోసం, ఉపాధి అవకాశాలకోసం ఎదురు చూసేవారు ఉన్నారు. తమ కాళ్లపై తాము నిలబడాలని, తమలోని నైపుణ్యాలతో ఉపాధిరంగంలో ఎదగాలనే తపన ఉన్న గృహిణిలు కూడా ఉన్నారు. కానీ వారికి అవకాశాలు దొరకడం లేదు. ఆ అవకాశాలను అందించడమే మార్గదర్శి లక్ష్యం. ఇక్కడ మార్గదర్శిగా ఉండే వ్యక్తులు ఆయా కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా నిలబడాలి. అంతే కాదు, వారికి సరైన మార్గదర్శనం చేసి పేదరికం నుంచి బయటపడేలా చేయాలి. తమ కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టినట్టే, ఆ కుటుంబానికి కూడా అండగా ఉండాలి. అలాంటి పర్యవేక్షణ ఉండాలి. అప్పుడే ఆయా కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయి.
చంద్రబాబు మానస పుత్రిక..
పీ4 కార్యక్రమాన్ని చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా చేయలేదు. ప్రభుత్వ పథకాలకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సాయం తీసుకుంటారు, దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ గా పిలుస్తారు. సీఎస్ఆర్ ఫండ్ కూడా కొంతవరకు మాత్రమే ఆసరాగా నిలబడగలదు. అంతకు మించి ఆ కుటుంబాన్ని నిజంగా పేదరికం నుంచి బయటకు తీసుకు రావాలంటే పీ4 లాంటి మార్గదర్శనం అవసరం. అందుకే చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
నేను సైతం..
కేవలం వ్యాపారవేత్తలు, ఇతర పారిశ్రామిక వేత్తలే కాదు, రాజకీయ నాయకులు కూడా పీ4 కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ఆయన పిలుపుమేరకు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు. ఇక సీఎం చంద్రబాబు కూడా నేను సైతం అంటూ తన సొంత నియోజకవర్గం కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు #IAmMargadarsi బ్యాడ్జిని అధికారులు ఆయనకు అందించారు. ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి విడత… pic.twitter.com/HL0LB1hhw7
— Telugu Desam Party (@JaiTDP) July 26, 2025
ఇప్పటి వరకు ఇలా..
రాష్ట్రంలో అధికారికంగా ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి దశ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన సీఎం అక్కడికక్కడే పీ4 కుటుంబాలను ఎంపిక చేసి, మార్గదర్శులుగా కొందరిని పరిచయం చేశారు. ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. తాజాగా పీ4 అధికారికంగా ప్రారంభం కాబోతోంది. మార్గదర్శులుగా ఉంటామంటూ ఇప్పటివరకు 57,503 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరూ కలసి మొత్తం 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఎన్నారైలను కూడా పీ4లో భాగస్వాములుగా చేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. వారికి అనుకూలంగా ఉండేందుకు https://zeropovertyp4.ap.gov.in/ అనే వెబ్ సైట్ రూపొందించి అందులో సాయం చేసేందుకు అవసరమైన విధానాలను ఉంచారు. ఈ వెబ్ సైట్ లో లాగిన్ అయి, తమ వివరాలు నమోదు చేసి, తాము ఎలాంటి సాయం చేయాలనుకుంటున్నామో చెబితే అధికారులు వారితో సంప్రదించి కుటుంబాల వివరాలు అందిస్తారు, ఆ కార్యక్రమాన్ని ఫాలోఅప్ చేస్తారు.
కేవలం కుటుంబాలనే కాదు, గ్రామాలు, మండలాలను కూడా దత్తత తీసుకుని అక్కడ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించే విధంగా పీ4 కార్యక్రమాన్ని రూపొందించారు సీఎం చంద్రబాబు. ఆయన స్ఫూర్తితో టీడీపీ నేతలు చాలామంది పీ4లో భాగస్వాములు అవుతున్నారు. పీ4 ద్వారా సాయం పొందిన కుటుంబాలు.. తమ జీవితాంతం చంద్రబాబుని గుర్తు పెట్టుకుంటాయనడంలో అనుమానం లేదు. ఆయా కుటుంబాల విజయం, ఆర్థిక స్థిరత్వం.. చంద్రబాబు ముందు చూపుకి నిదర్శనం అవుతుంది.